భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జోరుగా వర్షం కురుస్తోంది. ఓ అభాగ్యురాలు క్రీడామైదానం వేదిక వద్ద దీనస్థితిలో చలికి వణుకుతూ కనిపించింది. విషయం తెలుసుకున్న అన్నం శ్రీనివాసరావు ఆ మహిళను చేరదీసి అన్నం పౌండేషన్ ఆశ్రమానికి తీసుకెళ్లి మానవత్వం చాటారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన లక్ష్మి (65) రెండు సంవత్సరాల క్రితం భర్త చనిపోగా ఉన్న గుడిసె, కొద్దిపాటి ఇంటి స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించటంతో సింగరేణి క్రీడా మైదానం వేదిక వద్ద ఆశ్రయం పొందుతోంది. తనకు మేనకోడలు ఉందని తన దగ్గర అన్ని ఉన్నప్పుడు వచ్చి పోయేదని చెప్పారు. ఇప్పుడు రావడం మానేసిందని వాపోయారు.
మార్గంలోనూ మరువని మానవత్వం...
ఇల్లందు నుంచి కారులో ఖమ్మం బయల్దేరిన అన్నం శ్రీనివాసరావుకు గాంధీనగర్ సమీపంలో మతిస్థిమితం లేకుండా వెళ్తున్న యువకుడు తారసపడ్డాడు. యువకుడు మాట్లాడడం కూడా రాక జోరువానలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతన్ని శ్రీనివాసరావు కారులో తీసుకెళ్లి అల్పహారం అందించారు. అనంతరం ఆశ్రమానికి తీసుకెళ్లారు. కామేపల్లి మండలంలో మతిస్థిమితం లేని వ్యక్తిని ఆశ్రమానికి తరలించారు. ఇలా ఎవరూ లేని అభాగ్యులను చేరదీస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు శ్రీనివాసరావు.
ఇదీ చదవండి: Rain Alert: రాష్ట్రంపై అల్పపీడన ప్రభావమెంత? వాతావరణ శాఖ ఏం చెబుతోంది?