దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాద్రి క్షేత్రంలో సీతారాముల కల్యాణానికి ముహూర్తం ఖరారైన వేళ... కమనీయమైన పెళ్లి వేడుకకు పనులు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 25 నుంచి వచ్చే నెల 8 వరకు సాగే వసంతపక్ష ప్రయుక్త సన్నాహక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా... ఇవాళ తలంబ్రాలు కలిపే వేడుక ఆద్యంతం... అశేష భక్తుల జన సందోహం మధ్య వైభవోపేతంగా సాగింది. ఏప్రిల్ 2న రాములోరి కల్యాణం సందర్భంగా అంకురార్పణగా సాగిన తలంబ్రాల వేడుకలో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
ఉత్సవాలకు అంకురార్పణ
భద్రాద్రి ఆలయంలోని చిత్రకూట మండపంలో ఈ వేడుక కమనీయంగా జరిగింది. ఆలయ అర్చకులు, వేదపండితులు క్రతువు నిర్వహించి రోలు, రోకలికి పూజలు చేశారు. అనంతరం ముత్తైదువులతో పసుపు కొమ్ములను దంచారు. ఆలయ ఈవో నర్సింహులు, అధికారులు సిబ్బంది పసుపుకొమ్ములను దంచి పనులు ప్రారంభించారు. కల్యాణం రోజు భక్తులకు ఉచితంగా అందించనున్న ముత్యాల తలంబ్రాలను కలిపే ఘట్టం ప్రారంభించారు. బియ్యం, పసుపు, కుంకుమ, గులాలు, అత్తరు, సెంటు, నెయ్యి వేసి తలంబ్రాలు కలిపారు.
తలంబ్రాల కలిపేందుకు పోటీపడ్డ భక్తులు
మొత్తం 150 క్వింటాల తలంబ్రాలు కలిపేందుకు, పసుపు కొమ్ములు కొట్టేందుకు మహిళా భక్తులు పోటీపడ్డారు. భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, హైదరాబాద్, ఏపీలోని పలు ప్రాంతాల నుంచి గోటి తలంబ్రాలను తీసుకొచ్చారు. తలంబ్రాలు కలిపే వేడుకలో పాల్గొంటే... అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయన్న నమ్మకంతో మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ముత్యాల తలంబ్రాలను... అధికారులు, సిబ్బందితో కలిసి ఆలయ ఈవో నర్సింహులు ప్రధాన ఆలయంలోని సీతారాముల వద్దకు తీసుకొని వెళ్లారు. అనంతరం స్వామి వారికి డోలోత్సవం, వసంతోత్సవం వైభవంగా జరిగింది. ముందుగా స్వామి వారిని ఊయలలో కూర్చొపెట్టి ఆలయ పండితులు పాటలు పాడుతూ ధూపదీప నైవేద్యం సమర్పించారు. డోలోత్సవంలో భాగంగా బుక్కాను, రంగునీళ్లను చల్లి ఆ నీళ్లను భక్తులందరికీ పంచారు. ఆలయం వద్దకు వచ్చిన మహిళలు పరస్పరం రంగునీళ్లు చల్లుకున్నారు. సీతారాముల వారి తలంబ్రాల వేడుకలో పాల్గొనడంపై భక్తులు సంతోషంగా ఉన్నారు.
భారీ ఏర్పాట్లు
ఈ నెల 25 నుంచి మొదలుకానున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు ప్రారంభించింది. తెలుగురాష్ట్రాల నుంచే కాకుండా... దేశనలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాటు చేస్తున్నారు.