భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏజెన్సీ మండలాలకు సాగు, తాగునీరు లక్ష్యంగా సీతారామ ప్రాజెక్టులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన రోళ్లపాడు రిజర్వాయర్ ప్లాన్ను మార్చి ఏజెన్సీ మండలాలను ఎడారిగా మార్చే కుట్రలు చేస్తున్నారని అఖిలపక్ష నాయకులు ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య అధ్యక్షతన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, తెలుగుదేశం, భాజపా నేతలు సమావేశమయ్యారు. ఏజెన్సీ మండలాలకు నీళ్లు అందకుండా ఆంధ్రప్రాంతానికి లబ్ధి చేకూరేలా ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తున్నారని నాయకులు విమర్శించారు.
ఈ నెల 14వ తేదీన రోళ్లపాడు రిజర్వాయర్ సందర్శనకు అఖిలపక్ష నాయకులు వెళ్లనున్నట్టు తెలిపారు. సీతారామ ప్రాజెక్టులో భాగంగా రోళ్లపాడు రిజర్వాయర్ మొదటగా అనుకున్న విధంగా ఏజెన్సీ మండలాల్లో అన్నింటికీ తాగునీరు, సాగునీరు అందించే విధంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తమ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. కొందరు ప్రజాప్రతినిధులు ఇతర ప్రాంతాలకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో ఆవునూరి మధు, ఏపూరి బ్రహ్మం, బంధం నాగయ్య, కుటుంబరావు, ముద్రగడ వంశీ, సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావు, సారంగపాణి, జలీల్ పాష, సురేష్, రాజు, మురళి, మాధవ్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి: కొడంగల్ అభివృద్ధి పనులపై మంత్రి కేటీఆర్ సమీక్ష