ఆదిలాబాద్ జిల్లా కౌటాల, చింతలమానేపెళ్లి మండలాల్లోని ప్రాణహిత, పెన్ గంగా నదులపై ఏడు ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కౌటాల మండలంలోని సాండ్ గాం, విర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు ఉండగా... కేవలం సాండ్ గాం ఎత్తిపోతల పథకం మాత్రమే రైతులకు సాగునీరు అందిస్తుంది. వీర్దండి, గుండాయిపేట తుమ్మిడిహట్టి ఎత్తిపోతల పథకాల నుంచి రైతులకు చుక్కనీరు అందడం లేదు. చింతలమానేపెళ్లి మండలంలోని గూడెం, రణవెళ్లి ఎత్తిపోతల పథకాల నిర్మాణం పనులు ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. గుత్తేదారులు, అధికారులు రైతులకు హామీలు ఇచ్చి వెళ్లడం తప్ప ఈ పథకాలను ప్రారంభించకపోవడం గమనార్హం.
ఓ ట్యాంకు నిర్మించి చేతులు దులుపుకున్నారు…
కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ఏడేళ్ల క్రితం ప్రాణహిత జలాలను పొలాలకు అందించేందుకు పది కోట్ల రూపాయలతో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు కేవలం ఒక ట్యాంకును మాత్రమే నిర్మించారు. మళ్లీ అధికారులు అటు వైపు తిరిగి చూడలేరు. పైపులైను పనులు విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల విలువైన సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లారు. అదే విధంగా గుండాయిపేట ఎత్తిపోతల పథకాలు కొన్ని రోజుల పాటు రైతులకు నీరు అందించినప్పటికీ... మోటార్లు చెడిపోవడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఫలితంగా ఈ పథకాల కింద రెండు పంటలు పండించే రైతులకు తీవ్ర నష్టం జరుగుతోంది.
ఆరేళ్లుగా సాగుతూనే ఉన్నాయి..
ఎనిమిది వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చింతలమానేపెళ్లి మండలం లోని కోర్శిని వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు ఆరేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఎత్తిపోతల పథకానికి 46 కోట్లు కేటాయించగా నేటికీ పనులు పూర్తి కాలేదు. అదేవిధంగా గూడెం ఎత్తిపోతలకు 17 కోట్ల 50 లక్షల రూపాయల నిధులు కేటాయించగా.. రణవెల్లి ఎత్తిపోతలకు 28 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ పథకాలు కూడా ఇప్పటికీ అసంపూర్తిగానే ఉండటంతో రైతుల ఆశలు నెరవేరడం లేదు. అధికారులు ఇప్పటికైనా స్పందించి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి : రెండు రోజులుగా కఠినంగా లాక్డౌన్ అమలు