అవును... ఇవి తోకలేని ఎలుకలే... పాశ్యాత్య దేశాల్లో కనిపించే ఈ మూషికాలకు... ఇపుడు ఆదిలాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ మారెమ్మ ఆలయం కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. దశాబ్దాల చరిత్ర కలిగిన మారెమ్మ ఆలయం పచ్చని చెట్లతో అలరారుతోంది. భక్తుల కొంగు బంగారమై విరాజిల్లుతోంది. ఎలాంటి లాభాపేక్షలేని ఆలయ నిర్వాహకులు... ఇక్కడ ర్యాటస్ నర్వోజికస్...ఫ్యాన్సీ ర్యాట్స్‌గా పిలువబడే ఎలకలు పెంచుతున్నారు. మన దేశంలో అరుదుగా కనిపించే... ఈ ఎలుకల భోజనం పక్కాగా శాఖాహారమే. ఆకుకూరలతో పాటు గడ్డిని తినడం వీటి ప్రత్యేకత. సాధారణమైన ఎలుకలకంటే కాస్తంత బలంగా ఉండే ఈ ఎలుకలు... తెలుపు, నలుపు, దోర రంగులో ఉంటాయి. మొదట్లో రెండుగా ఉన్న వీటి సంఖ్య ప్రస్తుతం ఎనిమిదికి చేరాయి.
నిర్వాహకుల ప్రత్యేక శ్రద్ధ..
మారెమ్మ ఆలయానికి వచ్చే వాళ్లు అమ్మవారిని దర్శించుకున్నాక.. వీటికి గడ్డి, ఆకుకూరలు వేసి వెళ్తుంటారు. ఎలుకల యోగక్షేమాలపై నిర్వాహకులు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. వాటి కోసం ప్రత్యేకమైన జాలిపెట్టెను అమర్చారు. ఆలయ సమయాల్లో పెట్టె తలుపులు తీయడంతోనే... బయటకు వచ్చే ఈ మూషికాలు... తిరిగి వాటికవే పెట్టెలోకి జారుకుంటాయి. అసలు నీళ్లే తాగవని సందర్శకులు చెబుతున్నారు. పోషణ, పెంపకం పరంగా జాగ్రత్తలు తీసుకోవాలని జంతుశాస్త్ర అధ్యాపకులు పేర్కొంటున్నారు.
ఉద్వానవనంలా..
ఆలయ నిర్వాహకుల ఆసక్తి కారణంగా... ఎలుకల పరిసర ప్రాంతమంతా చిన్నపాటి ఉద్యానవనంలా కనిపిస్తోంది. నీటి వసతి కూడా ఉండడం వల్ల చల్లని వాతావరణం ఉంది. తోకలేని ఎలుకలతో పాటు కోళ్లు, పక్షులు, బాతులు, పావురాలనూ పెంచుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాటికి అవసరమయ్యే చిరుదాన్యాలను వేస్తారు. ఇక్కడ ఉన్న పక్షులన్నింటికీ.. వేర్వేరుగా ప్రత్యేకమైన ఇనుప పెట్టలతో గూళ్లు ఏర్పాటు చేసి వాటికి ఎలాంటి హాని లేకుండా జాగ్రతలు తీసుకున్నారు. అవసరాలరీత్యా పశువైద్యులతో చికిత్సలు చేయిస్తున్నారు.
మరిన్ని పెంచుతాం..
మారెమ్మ ఆలయంలో సాధారణ రోజులతో పాటు ప్రతి ఆదివారం, మంగళవారం, శుక్రవారం... ప్రత్యేక పూజలు జరుగుతాయి. సందర్శకులకు, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా శ్రద్ధ చూపుతున్న నిర్వాహకులు కొత్త రకం పక్షుల జాడ తెలిపితే... మరిన్నింటిని పెంచుతామని అంటున్నారు.
ఇవీ చూడండి: పౌరసమాజమా.. నిద్రలే! ఓ పౌరుడి ఆవేదన