మాఘమాసపు శుక్లపక్ష పంచమి నుంచి వసంతరుతువు ఆరంభమవుతుంది. పకృతి వికాసానికి, చదువు మనోవికాసానికి మాఘమాసం సంకేతం. ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం. దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది. ఈ రోజే సరస్వతీ దేవి జన్మించినట్లు బ్రహ్మవైవర్త పురాణంలో ఉంది. జ్ఞాన సంపత్ప్రద వీణాపాణి అయిన సరస్వతీ దేవికి ప్రీతిపాత్రమైన ఈ రోజున పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం విశేష ఫలప్రదమని చెబుతారు.
సరస్వతిని ఎలా పూజించాలి
మాఘ శుక్ల పంచమి నాడు ప్రాతకాలాన మేల్కొని, స్నానాది క్రతువులు ముగించి, మొదట గణపతిని పూజించాలి, తర్వాత శారదాంబా ప్రతిమను, పుస్తకాలను, కలాన్ని ఆరాధించాలి. అమ్మవారికి తెల్లని కుసుమాలతో, సుగంధ ద్రవ్యాలను అద్దిన నూతన వస్త్రాలతో అర్చించాలి. తర్వాత చిన్నారులకు విద్యారంభం చేయిస్తే సరస్వతి జ్ఞానాన్ని అనుగ్రహిస్తుంది.
బాసరలో అక్షరాభ్యాసాల కోలాహలం
తెలంగాణలోని నిర్మల్ జిల్లా బాసరలో కొలువైన శ్రీ జ్ఞానసరస్వతీ ఆలయంలో ఏటా ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుతారు. మన రాష్ట్రంనుంచే కాక పొరుగు రాష్ట్రాలనుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తారు.