అడవుల జిల్లాగా పేరున్న ఉమ్మడి ఆదిలాబాద్... ఎండలు భగభగమంటున్నాయి. సాధారణ స్థాయికి మించి ఉష్ణోగ్రతలు పెరిగి నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగి ప్రజలను కలవరపెడుతున్నాయి. జిల్లాలో సగటున 42 నుంచి 47 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 25 మంది వడదెబ్బకు గురై మృతి చెందారు.
కొరవడిన అవగాహన
వడదెబ్బతో మృతి చెందిన వారి కుటుంబాలకు ఆపద్బంధు పథకం కింద 50 వేల పరిహారం పొందొచ్చన్నది చాలా మందికి తెలియదు. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఆ దిశగా ఆలోచించడం లేదు. వడదెబ్బతో ఎవరైనా మృతి చెందినట్లు... స్థానిక ఠాణాలో, వైధ్యాదికారికి, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయాలి. ఈ త్రీమెన్ కమిటీ నిర్ధారించి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిస్తుంది. కానీ ఆసిఫాబాద్ జిల్లాలో 12 మంది మృతి చెందితే ఇద్దరి పేర్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం.
పరిహారం మంజూరులో జాప్యం
వడదెబ్బ మృతుల కుటుంబాలకు పరిహారం మంజూరు చేయడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది. 2017లో ఆసిఫాబాద్ జిల్లాలో 11 మంది మృతుల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నారు. త్రీమెన్ కమిటీ 9మంది అర్జీలు ఆమోందించగా... ఒకరికి మాత్రమే పరిహారం అందింది. ప్రభుత్వానికి నివేందించినా ఇంతవరకు నిధుల విడుదల కాకపోవడం వల్ల బాధిత కుటుంబాలు ఎదురుచూస్తున్నారు.
మధ్యాహ్నం ప్రయాణం ప్రమాదమే
పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో సాయంత్రం 5 దాటితే గాని రహదారులపై జన సంచారం కనిపించడం లేదు. గత 3 రోజులుగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో వృద్ధులు, ఉపాధి హామీ కూలీలు, చిన్నారులు, గర్భిణీల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
శీతల పానీయాల విక్రయాలు
జురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు శీతల పానీయాల వైపు మొగ్గుచూపుతున్నారు. డిమాండ్ భారీగా ఉడటం వల్ల వీటి విక్రయాలు ఊపందుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి తీసుకువచ్చి ఆసిఫాబాద్, కాగజ్‌నగర్‌లో విక్రయిస్తున్నారు. పేదవాడి ఫ్రిజ్‌గా గుర్తింపు పొందిన కుండలకు మార్కెట్లో గిరాకీ పెరిగింది. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వ్యాపారులు వివిధ సైజుల్లో కూలర్లు అందుబాటులోకి తెచ్చారు.
వేసవిలో ఎదురయ్యే సమస్యలు
ఎండలో ఎక్కువగా తిరిగినా, పని చేసిన నా శరీరానికి తగినంత నీరు అందక ఖనిజాలు లవణాలు లోపిస్తాయి. నిస్సత్తువ ఆవరించి తీవ్రమైన అలసట కలిగి స్పృహ తప్పుతారు. రక్తనాళాలు వ్యాకోచించి సొమ్మసిల్లి పడి పోవడం, వ్యక్తిగత పరిశుభ్రత లోపించి అతిసారం సోకే ప్రమాదం ఉంది. వడదెబ్బకు గురై పిల్లల నుంచి పెద్దల వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. శరీర ఉష్ణోగ్రత వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నప్పుడు వడదెబ్బ సోకుతుందని, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇవీ చూడండి: 'వస్తున్నాం... ఇక తెలంగాణలో ప్రభంజనం సృష్టిస్తాం..'