ఆదిలాబాద్‌లోని అర్గువాల్ అనే వ్యాపారి సోయా విత్తనాల సంచులను ఎమ్మార్పీ ధరలతో పాటు లాట్ నంబర్లను మార్పు చేసి రైతులకు విక్రయించిన ఘటన బయటపడింది. 30 కిలోల సోయా విత్తన సంచి అసలు ధర రూ.3 వేల 100 రూపాయలు కాగా.. ఆ వ్యాపారి దాన్ని రూ.3,900 మార్కర్‌తో మార్పు చేసి అంటగట్టారు. ఈ నెల 3న జరిగిన ఈ ఘటనను బాధిత రైతులు తాజాగా వ్యవసాయాధికారుల దృష్టికి తెచ్చారు. కర్షకులకు న్యాయం చేయాల్సిన వ్యవసాయాధికారులు.. సంబంధిత వ్యాపారికి సమాచారం అందించి విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తులు తీసుకోవడం బాధిత రైతులను మరింత కుంగదీస్తోంది. ఆదిలాబాద్‌కు చెందిన నిఖిల్ ఫర్టిలైజర్ అనే దుకాణ యజమానైతే ఓ అడుగు ముందుకేసి.. రేపు విత్తనాలు మొలకెత్తినా, మొలకెత్తకపోయినా తనకు సంబంధం లేదని మరీ బాండ్ పేపర్లు రాయించుకోవడంతోపాటు ఏకంగా రశీదుపైనే ముద్రించుకొని రైతులతో సంతకాలు తీసుకోవడం వ్యవసాయశాఖ డొల్లతనాన్ని బయటపెట్టిస్తోంది.
రైతుల ఆగ్రహం..
సకాలంలో నైరుతి రుతుపవనాలు రావడంతో రైతులు సోయా, పత్తి విత్తనాల కొనుగోళ్లలో నిమగ్నమయ్యారు. ప్రధానంగా ఆదిలాబాద్‌లో సిండికేట్‌గా మారిన కొంతమంది వ్యాపారులు.. నకిలీ లేబుళ్లు, నకిలీ లాట్ నంబర్లతో కూడిన నకిలీ విత్తన సంచులను విక్రయిస్తున్నారు. రెండు రోజుల కిందట అర్గుల్వారు, నిఖిల్ ఫర్టిలైజర్ దుకాణాల యజమానులు.. లాట్ నంబర్లు లేని విత్తనాలు విక్రయించిన ఘటన వెలుగు చూసింది. బాధిత రైతులు వ్యవసాయాధికారులను సంప్రదిస్తే స్పందించలేదు సరికదా.. సంబంధిత వ్యాపారులకు సమాచారం అందించి జాగ్రత్తలు తీసుకునేలా మధ్యవర్తిత్వం వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం..
ఆదిలాబాద్ జిల్లాలో ఈ ఏడాది దాదాపు 90 వేల ఎకరాల్లో సోయా పంట వేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేసింది. నిరుడు ప్రభుత్వ సంస్థల పరంగా రాయితీపై ఇచ్చిన సోయా పంట కాత, పూతలేకపోవడంతో ఈ ఏడాది ప్రైవేటులో లభించే విత్తనాలకు డిమాండ్ పెరిగింది. దీన్ని ఆసరా చేసుకున్న కొంతమంది విత్తన డీలర్లు.. నకిలీవి అంటగట్టడం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. విత్తనాలు మొలకెత్తనట్లయితే తాము బాధ్యులం కాబోమన్న.. సంఘటనలపై అధికారులు చర్యలు తీసుకుంటామంటూ చెబుతున్నారు.
అధికారి అండ..
ఒకరిద్దరు వ్యవసాయాధికారులతోపాటు.. టాస్క్‌ఫోర్స్ విభాగంలో ఓ పోలీస్ అధికారి సంబంధిత వ్యాపారులకు అనుకూలంగా చక్రం తిప్పడమే కాకుండా ఉన్నతాధికారులను సైతం పక్కతోవ పట్టించే ప్రయత్నం చేస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.