ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో పులి వరుస దాడులతో పరిసర గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రెండ్రోజుల క్రితం తాంసి.కే అటవీ శివారులో లేగ దూడను చంపిన పులి... తాజాగా గొల్లఘాట్ లో మరో ఆవును బలి తీసుకుంది. ఘటనా స్థలాన్ని అటవీశాఖ అధికారులు పరిశీలించారు. పులి కదలికలను పసిగట్టటానికి సీసీ కెమెరాలను అమర్చారు. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులి వచ్చినట్లు భావిస్తున్న అధికారులు... పెన్‌గంగా పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
అటవీ ప్రాంతం వైపు పశువులను తీసుకెళ్లకుండా అటవీ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు. ఘటన జరిగిన పెన్‌గంగా పరిసర ప్రాంతాల్లో పులి ఆనవాళ్ల కోసం అటవీ అధికారులు గాలించగా.. వరుస దాడులు స్థానికుల్లో కలవరం రేపుతున్నాయి. పులి కదలికలను పసిగట్టేలా.. పులి నుంచి ప్రజలను కాపాడేలా ప్రత్యేక బృందాలు గస్తీ తిరుగుతున్నాయి. ప్రజలు ఎవరూ భయపడొద్దని... ఉదయం, సాయంత్రం వేళల్లో అటవీ ప్రాంతం వైపు, పంటచేల వైపు వెళ్లొద్దని అటవీ అధికారులు సూచిస్తున్నారు. ఒకవేళ పులి తారసపడినా పరుగులు పెట్టకుండా నిటారుగా నిలుచుంటే దానంతట అదే వెనుదిరుగుతుందని చెబుతున్నారు.
ఇదీ చదవండి: కలకలం రేపుతోన్న పులి సంచారం... లేగదూడ బలి