Azad Encounter Case Update: మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ సహా జర్నలిస్టు హేమచంద్రపాండే ఎన్‌కౌంటర్ కేసు విచారణను ఆదిలాబాద్ కోర్టు ఈనెల 14కు వాయిదావేసింది. 2011 జులై రెండో తేదీన అప్పటి ఆదిలాబాద్ జిల్లా వాంకిడి మండలం సరికెపెల్లి అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్లో మృతి చెందారు. ఎన్‌కౌంటర్ బూటకమంటూ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్, హేమచంద్ర పాండే భార్య బబిత... అప్పట్లోనే సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేసును పరిశీలించిన సుప్రీం ధర్మాసనం... విచారణకు ఆదేశించింది. అప్పటి సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో అధికారుల బృందం... సరికెపెల్లి అడవుల్లో ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా ఎదురుకాల్పులు జరిగిన తీరును బొమ్మల ఆధారంగా మాక్ ఎన్‌కౌంటర్ చేసి... పోలీసులు జరిపిన ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తూ కోర్టుకు నివేదిక సమర్పించింది.
దీన్ని సవాలు చేస్తూ... స్వామి అగ్నివేశ్ సహా ఆజాద్ సతీమణి పద్మ సమగ్ర విచారణ జరపాలంటూ.... మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించగా తొలుత జిల్లా కోర్టు ద్వారా రావాలని సూచించింది. ఈమేరకు ఆదిలాబాద్ మున్సిఫ్ కోర్టులో రెండేళ్ల కిందట పిటిషన్ దాఖలు చేశారు. ఓ దశలో స్వామి అగ్నివేశ్ కూడా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పారు. సుదీర్ఘ కాలంగా విచారణ జరిపిన మున్సిఫ్ కోర్టు... పోలీసులు జరిపినది బూటకపు ఎన్‌కౌంటర్ కాదంటూ... పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. తరువాత ఆజాద్, హేమచంద్ర తరఫు న్యాయవాదులు తిరిగి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆత్మరక్షణకోసమే పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారని పోలీసుశాఖ పేర్కొనగా.. దాన్ని నిరూపించుకునేందుకు కోర్టుకు ఎందుకు రప్పించడం లేదని ఆజాద్, హేమచంద్రపాండే తరఫు న్యాయవాదులు ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు కేసును మళ్లీ జిల్లా కోర్టుకు బదిలీ చేయడంతో విచారణ తుదిదశకు చేరుకుంది. ఈనెల 14న పోలీసుల తరఫున సమర్పించే రాతపూర్వక వాదనలకు అనుగుణంగా తాము రాతపూర్వకంగానే స్పందిస్తామని ఆజాద్, పాండే తరఫున న్యాయవాదులు పేర్కొన్నారు. తప్పుచేసిన పోలీసులకు తప్పకుండా శిక్షపడుతుందనే భరోసా వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: