Rain in Telangana Latest News : రాష్ట్రంలో వర్షం తగ్గినా.. ముంపు కష్టాలు మాత్రం వీడలేదు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో వర్షాల ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దున పెన్ గంగా ప్రవాహ ఉద్ధృతితో పరివాహక ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. దాదాపుగా 50 వేల ఎకరాల పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల పరిధిలో ఉన్న 44వ నెంబర్ జాతీయ రహదారిపై వరద ప్రవహిస్తోంది. ఫలితంగా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సరైన డ్రైనేజీ, మురికి కాలువల వ్యవస్థ లేకపోవడంతో వరద నీరంతా పంట చేల్లోకి చేరుతోంది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న క్షేత్రస్థాయిలో సమస్యను పరిశీలించి.. హైవే పైనుంచి నీటి తరలింపునకు చర్యలు చేపట్టారు. అనంతరం అక్కడి రైతులకు భరోసా ఇచ్చారు.
ఆదిలాబాద్ పట్టణంలోని జీఎస్ ఎస్టేట్, బంగారిగూడ, ఖానాపూర్, శాంతినగర్, మహాలక్ష్మివాడ, రాంనగర్, వికలాంగుల కాలనీ, కేఆర్కే కాలనీల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. భీంపూర్ మండలంలో వాగులు, వంకల ప్రవాహంతో.. పిప్పల్ కోటి, అంతర్గావ్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వడూర్ సమీపంలో పెన్ గంగా నదిలో పడవను ఒడ్డుకు చేర్చేందుకు వెళ్లిన గంగపుత్రుడు వరదలో చిక్కుకుపోయాడు. ఆయనను తాడు సాయంతో లాగేందుకు వెళ్లిన మరో ఇద్దరూ ప్రవాహ ఉద్ధృతితో బయటకు రాలేకపోయారు. తాడు కట్టించి ముగ్గురిని సురక్షితంగా బయటకు రప్పించారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ ప్రాంతంలోని గ్రామాలకు బయట ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి.
హనుమకొండ జిల్లా పరకాల డివిజన్‌లో చలి వాగు అలుగు పోస్తోంది. నడికుడ మండలం కంటాత్మకూర్ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కాటారం నుంచి మేడారం వెళ్లే రహదారి మధ్యలో కేశవాపూర్, పెగడపల్లి గ్రామాల మధ్య పెద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. తెలంగాణ-మహారాష్ట్ర అంతర్రాష్ట్ర వంతెన వరద ఉద్ధృతికి గురైంది. జగిత్యాల జిల్లా అనంతారం వద్ద జాతీయ రహదారి వంతెన పైనుంచి నీటి ప్రవాహంతో ధర్మపురి, మంచిర్యాల వైపు రాకపోకలకు అంతరాయం కలిగింది. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి జూలపల్లి, ఎలిగేడు మండలాలకు వెళ్లే రహదారులపై వరద ప్రవాహం కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా ఊర చెరువులో గల్లంతైన పెంటప్ప అనే వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు పలుచోట్ల చెరువులు అలుగు పారుతుండటంతో స్థానికుల చేపల వేటలో మునిగారు. ప్రాజెక్టులు, చెరువులు నిండటంతో చేపలు రోడ్లపైన, పొలాల్లోన దర్శనమిస్తున్నాయి. ఇలాగే మేడ్చల్ పెద్ద చెరువు అలుగు పారడంతో.. పెద్ద ఎత్తున స్థానికులు చేపలు పట్టారు. వలలతో చేపలు పడుతూ సంతోషంగా గడిపారు.
ఇవీ చూడండి..
Rains In Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్‌లో విస్తారంగా వర్షాలు.. పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు
Hyderabad Rains : వర్షంలో పిల్లల్ని బయటకు పంపిస్తున్నారా.. బీ కేర్ఫుల్