ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అనేక జలపాతాలు, చారిత్రక ప్రదేశాలతో పాటు దర్శనీయ ప్రాంతాలు ఉన్నాయి. కుంటాల, పారాకప్పి, సప్తగుండాల, పొచ్చెర, గుంజాల, కనకాయి తదితర జలపాతాలతో పాటు గాంధారిఖిల్లా, గోండురాజుల కోట తదితర చారిత్రక ప్రదేశాలతో బాసర, నాగోబా, గూడెం తదితర దర్శనీయ ప్రాంతాలు, ప్రాజెక్టులు, దట్టమైన అటవీ ప్రాంతాలున్నాయి. ఇది వరకు జిల్లాలో వాటన్నిటి అభివృద్ధి కోసం రూ.104 కోట్లు అవసరమని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. కానీ ప్రభుత్వాలు నిధులు కేటాయించక అభివృద్ధి పనులు ఆగిపోయాయి. తాజాగా కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏ పరిధిలోని కొన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు రూ.9.96 కోట్లను విడుదల చేసింది.
గిరిజన సంస్కృతి ఉట్టిపడేలా
రాష్ట్రంలోనే ప్రసిద్ధ జలపాతమైన కుంటాల వద్ద రిసార్టు, అతిథిగృహం నిర్మాణంతో పాటు గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా గ్రామాన్ని తయారుచేయాలని భావిస్తున్నారు. ఇక లింగాపూర్ మండలంలోని సప్తగుండాల జలపాతం వద్ద మెట్ల మార్గం, రెయిలింగ్, రక్షణ కంచె, జలపాతం నుంచి గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం తదితర వాటిని ఏర్పాటు చేయనున్నారు. ఇక చారిత్రక ప్రదేశమైన గోండురాజుల కోటను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. దిగుడు బావి వద్ద మెట్ల మార్గం, అతిథిగృహం, ఫొటో గ్యాలరీ తదితర వాటిని ఏర్పాటుచేస్తున్నారు. ప్రస్తుతం వీటికి డిజైన్లు రూపొందించిన తర్వాత టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
కొవిడ్‌తో ఆదాయానికి గండి
ప్రకృతి ప్రేమికులతో పాటు కళకళలాడే పర్యాటక ప్రదేశాలు ప్రస్తుతం కొవిడ్ ప్రభావం కారణంగా వెలవెలబోతున్నాయి. కడెం, జన్నారం వంటి రిసార్టులకు పర్యాటకులు రావడం లేదు. కొవిడ్‌తో ప్రజల రాక తగ్గిపోయింది. ఫలితంగా ఆదాయానికి భారీగా గండిపడుతోంది.
త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి
జిల్లాలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఐటీడీఏకు నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో చేపట్టే పనులకు సంబంధించి ఆకృతులు (డిజైన్లు) రూపొందించిన తర్వాత టెండర్లు పూర్తిచేసి పనులు ప్రారంభమవుతాయి. వీటితో పాటు మరిన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం ఇది వరకే ప్రతిపాదనలు పంపించాం.
- రవికుమార్, జిల్లా పర్యాటకశాఖ అధికారి
- సప్తగుండాల జలపాతానికి విడుదలైన నిధులు : రూ.1.35కోట్లు
- కుంటాల వద్ద గిరిజన గ్రామం కోసం : రూ.3.81కోట్లు
- ఉట్నూర్‌లోని గోండు రాజుల కోటకు : రూ.3.92కోట్లు
ఇదీ చదవండి : వరుస ఎన్నికలపై కారు నజర్.. పకడ్బందీ వ్యూహంతో కార్యాచరణ