MSME Loans Centre New Scheme : సొంతంగా చిన్న వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారికి కేంద్ర ప్రభుత్వం మంచి శుభవార్త చెప్పింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ)లకు ఏ హామీ లేకుండా రుణాలు ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకురానుంది. ఆ పథకం ద్వారా ఎంఎస్ఎంఈలకు రూ.100 కోట్ల వరకు రుణాలు ఇవ్వనుంది. ఆ రుణ హామీ పథకాన్ని అమలు చేసే విషయంపై త్వరలోనే కేంద్ర మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది!
ఈ మేరకు ఆ విషయాన్ని బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ ఔట్రీచ్ కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదం పొందాక ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ, బ్యాంకులు రుణ హామీ పథకాన్ని అమలు చేస్తాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంఎస్ఎంఈ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకుల్లో తీసుకునే రుణాలకు ఎలాంటి థర్డ్ పార్టీ హామీ కానీ, పూచీకత్తు కానీ అవసరం ఉండదని నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు.
అయితే ఎంఎస్ఎంఈలకు వర్కింగ్ క్యాపిటల్ నిధులు బ్యాంకులు ఇస్తున్నా, లోన్లు ఇవ్వడం లేదని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ గుర్తు చేశారు. కొత్త పథకం ద్వారా మూలధనంతో పాటు ప్లాంటు, యంత్రాలకు కూడా లోన్స్ తీసుకోవచ్చని తెలిపారు. సొంత వ్యాపారం కోసం రూ.100 కోట్ల వరకు రుణాలు పొందవచ్చని వెల్లడించారు. ఎలాంటి పూచీకత్తు లేకుండానే రుణాలు అందిస్తారని ప్రకటించారు. మంత్రి మండలి ఆమోదం తెలిపితే, ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అమలులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
ఎంఎస్‌ఎంఈ రంగంలో కర్ణాటక చేస్తున్న కృషిని సీతారామన్ ప్రశంసించారు. రాష్ట్రంలో 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, అవి 1.65 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని, ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని ఆమె చెప్పారు. కర్ణాటక వ్యాప్తంగా ఉన్న SIDBI శాఖలు రూ.1,619 కోట్లతో అత్యుత్తమ పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్నాయని ఆమె తెలిపారు.