సంక్రాంతి రైతుల పండగ. మునుపటి సంతోషం ఈ ఏడాది అన్నదాతల్లో కనిపించడం లేదు. కాలం కలిసిరాలేదు. పంటల దిగుబడి తగ్గిపోయింది. ఎకరాకు రావాల్సిన 10 క్వింటాళ్ల దిగుబడి అయిదు క్వింటాళ్లు కూడా దాటలేదు. గతేడాదితో పోల్చుకుంటే పురుగుమందులు, ఎరువుల ధరలు పెరిగాయి. దిగుబడి తగ్గిపోవడంతో పెట్టుబడి రాని దుస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం క్వింటాలు పత్తికి మద్దతు ధర రూ.5,825 నిర్ణయించినా పింజ, దూది నాణ్యత పేరిట సీసీఐ రూ.5,725కు తగ్గించింది. మద్దతు ధరలోనూ రూ.వంద కోత రైతులే భరించాల్సి వచ్చింది. వాతావరణ ఆధారంగా నష్టపోయిన రైతులకు రెండేళ్లుగా పంటల బీమా పరిహారం నేటికీ పంపిణీ కాలేదు. ఫలితంగా రైతు కుటుబాల్లో సంకాంత్రి పండగ శోభ కనిపించడంలేదు.
రైతుపైనే భారం:
కరోనా మహమ్మారి వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపింది. సీజన్ ఆరంభంలోనే నకిలీ విత్తనాల చెలామణిని వ్యవసాయ శాఖ అరికట్టలేకపోయింది. ఆదిలాబాద్, ఇంద్రవెల్లి, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో జోరుగా నకిలీ విత్తనాల దందా సాగింది. అడపాదడపా పోలీసు కేసుల నమోదైనా అసలు సూత్రధారులు ఎవరనేది తేల్చనేలేదు. ప్రతి దానికి కరోనా ముప్పు సాకుతో వ్యవసాయశాఖ, పోలీసు యంత్రాంగం అంటీముట్టనట్లు వ్యవహరించడంతో రైతులు నష్టపోవాల్సి వచ్చింది. కళతప్పిన సంక్రాంతి పండగకు రైతు సాక్ష్యంగా నిలవాల్సి వచ్చింది.
ఆశించిన పత్తిరాలేదు:
గతేడాది సంక్రాంతి పండగకు పత్తి అమ్మకానికి వచ్చినట్లు ఈ ఏడాది రాలేదు. కోనుగోళ్లతో కళకళలాడాల్సిన మార్కెట్లో మునుపటి సందడిలేదు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 90 లక్షల క్వింటాళ్లకుపైగా పత్తి దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. ఇప్పుడు సీజన్ ముగింపు దశకు చేరుతున్నా 50 లక్షల క్వింటాళ్లు కూడా రాలేదు.
- పూర్ణచందర్‌రావు సీసీఐ కొనుగోళ్ల అధికారి, ఆదిలాబాద్
పరిశ్రమలపై ప్రభావం:
ఈ ఏడాది పత్తి దిగుబడి సగానికి పడిపోయింది. ఆదిలాబాద్‌లో 28 జిన్నింగ్ మిల్లులపై తీవ్ర ప్రభావం పడింది. అందరూ సీసీఐ కొనుగోలు కేంద్రాలుగా ఒప్పందం చేసుకోవాల్సి వచ్చింది. ప్రైవేటు వ్యాపారం సరిగా సాగడం లేదు. పరిశ్రమలకు ప్రభుత్వం తరఫున రావాల్సిన రాయితీ నిధులను సకాలంలో అందిస్తే కొంత ఉపయుక్తంగా ఉంటుంది.
- జవ్వాజీ సచిన్, జిన్నింగ్ యజమాని
బీమా డబ్బులు ఇవ్వడంలేదు:
రైతులు ఆనందంగా ఉంటేనే పండగలకు అర్థం ఉంటుంది. మూడేళ్లుగా అనుకున్నట్లుగా పంట పండటం లేదు. పంటల బీమా కోసం 2018-19, 2019-20లో సంవత్సరంలో పంటల నష్టం జరిగినట్లు బీమా కంపెనీలే తేల్చినా ఇప్పటికీ పరిహారం పంపిణీ చేయలేదు. రెండేళ్లలో రూ.44.99 కోట్లు రైతులు ప్రీమియం చెల్లించినట్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వాటా రూ.160 కోట్లు చెల్లించక మాకు రావాల్సిన రూ.269 కోట్ల పరిహారం అందడంలేదు.
- వినోద్‌రెడ్డి, జామిడి, తాంసి
పంట పండితే పండగ:
పంట పండితేనే రైతులకు పండగ. నేను 15 ఎకరాల్లో సాగు చేస్తున్నా. నిరుడు 200 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తే ఈ ఏడాది 70 క్వింటాళ్లు కూడా రాలేదు. వ్యవసాయం జూదంగా మారింది. సంక్రాంతి వచ్చిందంటే ప్రతి రైతు ఇంట్లో ఆనందం కనిపించేది. ఈ ఏడాది ఆ హడావుడి లేదు. ప్రకృతి కరుణించలేదు. ప్రభుత్వం ప్రోత్సాహం అందించలేదు.
- పి.మాధవ్, రైతు, జైనథ్ మండలం
ఇదీ చదవండి: అజయ్‌తో పెళ్లి.. నాన్న ఒప్పుకోలేదు: కాజోల్