KTR on CCI: ఆదిలాబాద్‌లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ కోసం కేంద్రం పైన మరింత ఒత్తిడి తీసుకురానున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ విషయమై ఆదిలాబాద్‌కు చెందిన స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న నేతృత్వంలో జిల్లాలోని ఇతర ప్రముఖులు తనను ప్రగతిభవన్‌లో కలిసిన సందర్భంగా కంపెనీ పున ప్రారంభం చేపట్టాల్సిన ఆందోళన కార్యాచరణపై చర్చించారు. జిల్లాలో సీసీఐ ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే.. త్వరలో ఐటీపార్కు, టెక్స్ టైల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.
అమ్మేసేందుకు కుట్ర
సీసీఐ పున ప్రారంభానికి అవసరమైన అన్ని రకాల ప్రత్యేక రాయితీలు, కొత్త కంపెనీని ఏర్పాటు చేస్తే ఎలాంటి రాయితీలు వస్తాయో వాటిని సీసీఐకి అందించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఒకవైపు ఉమ్మడి ఆదిలాబాద్‌లో అనేక పరిశ్రమలను స్థాపించి జిల్లాలో ఉపాధి అవకాశాల కల్పన కోసం తాము పాటుపడుతుంటే.. మరోవైపు కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అప్పనంగా అమ్మేవేసేందుకు కుట్ర చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే ఆదిలాబాద్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లును ప్రారంభించిన చరిత్ర, నిబద్ధత తమకు ఉందని గుర్తు చేశారు.
భాజపా ఎంపీని నిలదీస్తాం
సీసీఐ ఏర్పాటు కోసం అందరూ కలిసి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన ఉద్యమ కార్యాచరణ చేపడతామని మంత్రికి స్థానిక నాయకత్వం తెలిపింది. ఈ విషయంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సాధన సమితిగా ఏర్పడి ఉద్యమిస్తామని నేతలు పేర్కొన్నారు. సీసీఐ పునరుద్ధరణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని ఆదిలాబాద్‌కు చెందిన భాజపా ఎంపీని నిలదీస్తామన్నారు. సీసీఐ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం నిరంతర ప్రయత్నాలు చేయడం పట్ల ప్రభుత్వానికి స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న అదిలాబాద్ జిల్లా ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.
ఇదీ చదవండి : జిల్లా అధ్యక్షులను ప్రకటించిన కేసీఆర్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!