ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వ్యవసాయ డివిజన్ కేంద్రంగా శనగల కుంభకోణం చోటుచేసుకుంది. రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సిన లక్షలాది రూపాయలు విలువ గల శనగలను కొంతమంది అధికారులు ప్రైవేటులో విక్రయించుకుని సొమ్ముచేసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారుల బృందం నిర్వహించిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధ్యులైన అధికారులు ఈ కుంభకోణం బయటకు రాకుండా ఉండేందుకు తనిఖీలకు వచ్చినవారిని ప్రసన్నం చేసుకునేందుకు అన్ని రకాలైన చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు జోక్యం తీసుకుని... అప్పటి అధికారులను విచారిస్తే అసలు కథ బయటపడే అవకాశం ఉంది.
జరిగిందేమిటీ..?
2019-20 ఖరీఫ్ కాలానికి జాతీయ ఆహార పథకం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం) కింద ఇచ్చోడ వ్యవసాయ డివిజన్‌కు 16 కిలోలకు ఒక కిట్ చొప్పున (దాదాపుగా 300 కిట్లు) శనగల కేటాయింపు జరిగింది. అంటే 4800 కిలోల శనగలన్నమాట. ఒక్కో కిలోకు రూ. 56 చొప్పున పరిగణలోకి తీసుకుంటే రూ 2.68లక్షల విలువ చేసే శనగలను ఇచ్చోడ డివిజన్‌లోని తొమ్మిది మండలాల రైతులకు ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉంది. కానీ అప్పటి డివిజన్‌స్థాయి అధికారితో పాటు ఒకరిద్దరు జిల్లాస్థాయి అధికారులు రైతులకు పంపిణీ చేకుండానే... చేసినట్లు నివేదికలు తయారుచేసి ప్రైవేటులో అమ్ముకోవడం సొంతశాఖ అధికారవర్గాల్లోనే చర్చనీయాంశమైంది.
జిల్లాకు విత్తన కిట్లు వచ్చిన మాట వాస్తవమేనన్న జిల్లా వ్యవసాయాధికారి...
జిల్లాకు ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎం పథకం కింద శనగల కిట్లు వచ్చిన మాట వాస్తవమే. జిల్లా వ్యవసాయాధికారి ఆశాకుమారి అంగీకరించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన అధికారులు తనిఖీలు నిర్వహించారన్నారు. తనిఖీలు సాధారణమైనవేనని తెలిపారు. ఇచ్చోడ డివిజన్‌కు కేటాయించిన విత్తనాలను రైతులకు పంపిణీ చేయాలని అప్పటి ఏడీఏ, ఏవోలకు సూచించామని తెలిపారు. ఆ దస్త్రంపై తాను సంతకం చేశానా? లేదా? అనేది చూడాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర వివరాలను తెలుసుకుంటానని తెలిపారు. రైతుల వారీగా నివేదికలను పరిశీలించి అక్రమాలు జరిగితే ప్రభుత్వానికి నివేదిస్తామని వెల్లడించారు.
జాతీయ ఆహార భధ్రత పథకం...
నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ పథకం(జాతీయ ఆహార భధ్రత పథకం) కింద కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రతి జిల్లాకు నూనెగింజలు, పప్పుదినుసులు, బియ్యం, పోషక పదార్థాలను పంచే దినుసులను ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లా నేల స్వభావానికి అనుగుణంగా నాణ్యతా నిర్దారణ పరీక్షల కోసం శనగ విత్తనాలను పంపిణీ చేస్తుంది. జిల్లాకు వచ్చే విత్తనాలను వ్యవసాయశాఖ డివిజన్లు, మండలాలవారీగా కేటాయిస్తోంది. తరువాత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి ఎంపిక చేసిన రైతులకు వ్యవసాయశాఖ ఉచితంగా పంపిణీ చేస్తుంది.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం...
ఆహార ఉత్పత్తుల ఉత్పాదకతతో పాటు సాగు విస్తీర్ణాన్ని పెంచి పంటల మార్పిడిని ప్రోత్సహించాలనేది ఈ పథకం ప్రధాన ఉద్దేశం. దీని కింద విత్తనాలనే కాకుండా అవసరమైతే కొన్ని సందర్భాలలో దుక్కికి అయ్యే ఖర్చులను, యంత్రపరికరాలను, మందులను సైతం పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఇదంతా పథకంలో అంతర్భాగమే. ప్రతి కార్యక్రమం గ్రామసభ కేంద్రంగానే జరగాలనే నిబంధన ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎంలో ఉంది. చేతికొచ్చిన పంటను రైతులు తిరిగి వ్యవసాయశాఖ ద్వారానే విక్రయించాలనే నిబంధనేమీలేదు. బహిరంగ విపణిలో ఎక్కడైన విక్రయించుకోవడానికి వెసలుబాటు ఉంది.
ఇదీ చదవండి: Mahatma Gandhi: ఆ గ్రామంలో ఏ శుభకార్యమున్నా మొదటి పూజ మాత్రం మహాత్ముడికే...