వేసవికాలంలో తప్ప... వర్షాకాలంలో అడుగుతీసి అడుగువేయాలని కాలిబాట. కేవలం 5 కిలోమీటర్ల రోడ్డును బాగు చేయకపోవటంతో ఏకంగా 40 కిలోమీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సి వస్తోంది. అధికారులు, ప్రజాప్రతినిధులకు పట్టని అమాయక ఆదివాసీల జీవితాలు.... వెరసి ఆదిలాబాద్ గ్రామీణ మండలం అసోదా పంచాయతీ పరిధిలోని నాలుగు ఆదివాసీ పల్లెల గోడు ఇది. తాగునీటికి సైతం నోచుకోని ఆ పల్లెలో 40 కుటుంబాలు నివసిస్తాయి. జనాభా 229 మంది. గతంలో పిప్పల్‌ధరి పంచాయతీలో ఉన్న అసోదా... మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల ముందు మరో మూడు పల్లెలతో కలిపి జనాభా 559 కి చేరటంతో నూతన పంచాయతీగా అవతరించింది. పంచాయతీగా ఏర్పడిందనే సంతోషమే కానీ కనీస రహాదారి సౌకర్యానికి నోచుకోలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎడ్లబండ్లే దిక్కు...
పిప్పల్‌ధరి నుంచి వాన్‌వట్ మధ్య కేవలం 5 కిలోమీటర్ల రహదారి సౌకర్యం కల్పిస్తే...30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఆదిలాబాద్‌కు చేరుకోవచ్చు. కానీ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో మావల, గుడిహత్నూర్, ఇంద్రవెల్లి మండలాల మీదుగా 50 కిలోమీటర్ల దూరం కాలిబాటన, లేదంటే ఎడ్లబండిపై ప్రయాణించాల్సి వస్తోంది. ఫిబ్రవరి 3న అనారోగ్యానికి గురైన మహిళను... ఎడ్లబండిపై ముత్నూర్‌కు తీసుకెళ్లి వైద్యం చేయించి ఇంటికి తీసుకురాగా... అదేరోజు రాత్రి చనిపోయింది. జనవరి 11న ఇదే గ్రామానికి చెందిన మరో మహిళకు పురిటినొప్పులు రావడంతో ఎడ్లబండిపై తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రసవించింది.
కనీస వసతులకు నోచుకోని అసోదా, బుర్కి, పొన్నగూడ, బొప్పాపూర్ ప్రజలంతా ఆదివాసీలే. ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలోకి వచ్చే ఈ పల్లెల్లో ఇప్పటిదాకా ఉన్నతాధికారులెవరూ కనీసం అటువైపు చూడలేదు. ప్రతి పల్లెకు మండల కేంద్రాన్ని అసుసంధానం చేయాలనే ప్రభుత్వ ఆశయం ఇక్కడ అమలు కావడం లేదు. అడవిలో లభించే కర్రలతో నిర్మించుకున్న మట్టి ఇళ్లు తప్ప... పక్కా ఇళ్ల జాడే కనిపించడం లేదు.