నిన్న మొన్నటి వరకు బోసినవ్వుతో సందడి చేసిన ఆ బాబు కరోనా మహమ్మారి సోకి అమ్మ ఒడికి దూరమయ్యాడు. చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆ చిన్నారని బతికించుకోడానికి తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆదిలాబాద్ జిల్లా తాంసి గ్రామానికి చెందిన సంతోశ్-పౌర్ణమి దంపతుల తొమ్మిది నెలల బాబు కరోనాతో హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. భీంపూర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన పనిచేసే సంతోశ్ ఇటీవలే కరోనా బారిన పడ్డాడు. ఆ తర్వాత అతని భార్యకూ వైరస్ సోకింది.
వీళ్లిద్దరు కోలుకుంటున్న తరుణంలో వారి గారాలపట్టి శ్రీయశ్ మహమ్మారి బారిన పడ్డాడు. తొలుత బాబును ఆదిలాబాద్ రిమ్స్‌లో చేర్పించారు. పరిస్థితి విషమించగా.. హైదరాబాద్‌కు తరలించారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రోజుకు రూ.70వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చవుతోందని.. తమ చిన్నారి ప్రాణం కాపాడటానికి సాయం చేయాలని ఆ దంపతులు కోరుతున్నారు. బాబు ప్రాణం రక్షించే దాత కోసం ఎదురుచూస్తున్నారు.
- ఇదీ చదవండి : తెలంగాణకు మరో 13,500 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు