ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో కాల్పుల మోతతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాతకక్షలతో రాజకీయ ప్రత్యర్థులైన ఫరూక్ అహ్మద్, వసీం వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్ కాల్పులు జరపగా... ముగ్గురు గాయపడ్డారు.
మాటా మాటా పెరిగి.. తూటా వరకు
కాల్పుల మోతతో ఆదిలాబాద్ తాటిగూడ కాలనీలో అలజడి రేగింది. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్, తెరాస నేత వసీం వర్గాల మధ్య కొంతకాలంగా రాజకీయ కక్షలు నెలకొన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. పరస్పరం దాడులు చేసుకుంటున్న క్రమంలో ఎంఐఎం నేత తల్వార్‌తో దాడి చేస్తూ, మరో చేత్తో తుపాకీతో కాల్పులు జరిపాడు. అనుకోని ఘటనలో మన్నన్, మోతేషాన్, జమీర్ గాయపడగా...క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు.
అప్పటి నుంచే తగాదాలు
గత మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం తరఫున ఫరూక్ భార్య బరిలో దిగగా... తెరాస తరఫున వసీం భార్య పోటీచేశారు. ఫరూక్ భార్య ఎన్నికల్లో గెలవగా...వసీం వర్గం ఓటమిపాలైంది. అప్పటినుంచే ఇరువర్గాల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న డీఎస్పీ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఎమ్మెల్యే జోగు రామన్న పరామర్శించారు. కాల్పులు జరిపిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్ అహ్మద్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: బాలిక మైనర్... కులాలు వేరు... ప్రేమజంట ఆత్మహత్య!