No Milk Supply for Ashram Schools: ఆదిలాబాద్ జిల్లా అధికారుల నిర్లక్ష్యం.. ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో చదువుకుంటున్న నిరుపేద విద్యార్థులకు శాపంగా పరిణమిస్తోంది. గిరిజన వసతి గృహాల్లో చదువుకుంటున్నవిద్యార్థులకు ఒక్కొక్కరికి సగటున రోజుకు 50 మి.లీ. పాలను ప్రభుత్వం పంపిణీచేస్తోంది. ఒక్కో లీటరు పాల కొనుగోలుకు ప్రభుత్వం రూ. 47 చొప్పున ప్రత్యేక నిధులను సైతం కేటాయిస్తోంది. కానీ ఆదిలాబాద్ జిల్లాలో మూడు నెలలుగా పాల సరఫరా స్థంభించింది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను అనుసంధానం చేసే ఉట్నూర్ ఐటీడీఏ పరిధిలో మొత్తం 133 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 31,006 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఒక్కొక్కరికి 50 మి.లీ. చొప్పున మొత్తం 150.3 లీటర్ల పాలను ప్రభుత్వం సరఫరా చేస్తోంది. లీటరుకు రూ. 47 చొప్పున రోజుకు రూ. 72,850ను పరిగణలోకి తీసుకుంటే నెలకు రూ. 21,85,500 నిధులను చెల్లిస్తోంది. జనవరి నుంచి ఇప్పటిదాకా విద్యార్థులకు పాలసరఫరా చేయనప్పటికీ మూడు నెలలుగా దాదాపుగా.. రూ. 6.55 లక్షల బిల్లులు తయారుచేసినట్లు విశ్వసనీయ సమాచారం. గతేడాది నవంబరు- డిసెంబర్ నెలలో సరఫరా చేసిన పాలకు ప్రభుత్వం రూ. 22 లక్షలు చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పటికి కేవలం రూ. 15 లక్షలే చెల్లించినట్లు సమాచారం. మార్చి నెలాఖరుతోనే ఆర్థిక సంవత్సరం ముగిసినప్పటికీ ఇంకా బిల్లుల లెక్క తేలకపోవడం... ఐటీడీఏ అధికారుల పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతోంది.
వారికి వరంగా మారింది: ఆదిలాబాద్, బోధ్, ఉట్నూర్, ఆసిఫాబాద్, జైనూర్, కాగజ్‌నగర్, మంచిర్యాల, నిర్మల్ డివిజన్లుగా ఉన్న ఐటీడీఏ ఆశ్రమ పాఠశాలల విద్యావిభాగంపై అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో వార్డెన్లకు కలిసివస్తోందనే విమర్శలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడంతో నిరుపేద విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసే పాలు అందకుండాపోతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: సంక్షేమ శాఖల్లో నిధుల కొరత.. ఆ విద్యార్థులకు నిలిచిన ఉపకార వేతనాలు!