![సమస్తం న(నె)ట్టింట్లోంచే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6581647_46_6581647_1585467217080.png)
ఇది వరకు ఆన్‌లైన్ పరీక్షలంటే ఎక్కడో పెద్ద పట్టణాల్లో, ఉన్నత స్థాయి పరీక్షలకు పెట్టేవారు. కరోనా మూలంగా సెలవులివ్వడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యేకంగా యాప్ తయారు చేసి రోజువారీ పరీక్ష నిర్వహిస్తున్నారు. నిర్మల్ ఓ పాఠశాల యాజమాన్యం ఇప్పటికే పూర్తయిన సిలబస్‌లోంచి రోజూ ఒక పరీక్ష ఆన్‌లైన్‌లో రాయించేందుకు తల్లిదండ్రులకు నిత్యం ఫోన్ చేస్తున్నారు. పరీక్ష పూర్తయి సబ్‌మిట్ చేయగానే ఎక్కడ తప్పు రాశారో ఎరుపు రంగుతో మార్కు వస్తుంది. ఫలితం వెంటనే ఆన్‌లైన్లోనే పంపిస్తున్నారు.
చదవడం కష్టమైతే.. వినడం ఇష్టమే కదా..
![సమస్తం న(నె)ట్టింట్లోంచే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6581647_648_6581647_1585467058035.png)
- వీరు ఆదిలాబాద్‌కు చెందిన మనోజ్ఞ, అబిజ్ఞ. సమయం వృథా చేయొద్దని వాళ్ల నాన్న మల్లెపూలమనోహర్ ఇంట్లోనే వారి కోసం ఆన్‌లైన్లో పాఠాలు, కథలు వినే ఏర్పాటు చేశారు. కరోనా సెలవుల నేపథ్యంలో పిల్లల కోసం అమెజాన్ సంస్థ కల్పించిన ఉచిత(మిగతా సమయాల్లో వీటిని ఉపయోగించుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది)ఆడియో పుస్తకాల వినియోగపు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.
- ఎవరైనా ఈ సౌకర్యాన్ని పొందాలనుకుంటే ఈ లింక్‌ను stories.audible.com/discovery క్లిక్ చేయడం ద్వారా నచ్చిన పుస్తకాన్ని ఎంచుకొని కళ్లతో చదవకుండానే చెవులతో మొత్తం విషయాన్ని చక్కగా వినొచ్ఛు ఇందులో పూర్వప్రాథమిక విద్య నుంచి ప్రపంచ ప్రఖ్యాత రచయితలు రాసిన అనేక పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పిల్లలకు చక్కని కథలు, కొత్తకొత్త విషయాలు తెలుసుకునేందుకు ఇది మంచి అవకాశమని ఆదిలాబాద్‌లో సహాయ ఆడిట్ అధికారిగా పనిచేస్తున్న మనోహర్ అభిప్రాయపడుతున్నారు.
ఇంటి నుంచే మ్యూజియంలను 360 డిగ్రీల కోణంలో చూడొచ్ఛు.
![సమస్తం న(నె)ట్టింట్లోంచే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6581647_95_6581647_1585467042413.png)
ఈ పిల్లలు నిర్మల్‌కు చెందిన మేధశ్రీదత్త, కోమల్‌శ్రీదత్త. ఇంట్లో నుంచే పారిస్‌లోని ప్రఖ్యాత మ్యూజియం ఆమూలాగ్రాన్ని వీఆర్(వర్చువల్ రియాలిటీ)ద్వారా 360 డిగ్రీల కోణంలో వీక్షిస్తున్నారు. కరోనా కట్డడిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా విద్యాసంస్థలన్నీ మూసేయడంతో పిల్లలు ఇంట్లోనే ఉండి వింతలు, విశేషాలు, అద్భుతాలను వీక్షించేందుకు ప్రముఖ సంస్థలు కల్పించిన ఈ అవకాశం చక్కగా ఉపయోగపడుతోందని ఆ చిన్నారుల తండ్రి మధుమోహన్ చెప్పారు.
- యూరప్‌లోని 17 ప్రఖ్యాత మ్యూజియంలను వీఆర్ ద్వారా వీక్షించే అవకాశాన్ని ఉచితంగా కల్పించారు. వీటిని చూడాలంటే గూగుల్‌లో virtual tour of Europe museum ద్వారా ఆసక్తి ఉన్న మ్యూజియంను చక్కగా ఇంట్లోనుంచే చూసేయచ్ఛు ఇవి పిల్లలతో పాటు పెద్దలకూ ప్రత్యక్షంగా దగ్గరుండి చూసిన అనుభూతిని కలిగిస్తాయి.
ఉపయోగించుకుంటే మేలు..
దాదాపుగా ప్రతి ఇంట్లో స్మార్ట్‌ఫోన్ కనిపిస్తోంది. పిల్లలకు ఉపయోగపడే చదువుకు సంబంధించిన పలు కార్యక్రమాలు అంతర్జాలంలో ఉంటున్నాయి. పొద్దస్తమానం చరవాణి పట్టుకొని ‘గేమ్’ ఆడకుండా కొద్ది సమయం విజ్ఞానానికి సంబంధించిన అంశాలపై దృష్టి పెడితే సెలవులు సద్వినియోగమవుతాయి.
- యూకేకు చెందిన కేంబ్రిడ్జ్ ప్రచురణ సంస్థ 700 ఆన్‌లైన్ పుస్తకాలను మే నెలాఖరు వరకు ఉచితంగా అందుబాటులో ఉంచుతున్నారు.
- మన దేశంలో ప్రఖ్యాతి గాంచిన అమర్‌చిత్రకథ, టింకిల్ మేగ్‌జైన్ తమ క్యాట్‌లాగ్‌ను మార్చి 31 వరకు ఉచితంగా అందుబాటులో ఉంచాయి.
- యూట్యూబ్ ఛానల్స్‌లో పిల్లలకు ఉపయోగపడే క్రాష్‌కోర్స్ కిడ్స్, సైన్స్ ఛానెల్, ప్రీస్కూల్, కిడ్స్ లెర్నింగ్‌ట్యూబ్, సైన్స్ మ్యాక్స్ వంటి అనేక కార్యక్రమాలను అందుబాటులో ఉంచారు.
- ఇంట్లోనే ఉండి కాలక్షేపంతో పాటు, ఆలోచన పెరిగేందుకు సుడోకు, గళ్లునింపడం వంటి వాటితో ఉపయోగకరంగా ఉంటుంది.సమస్తం న(నె)ట్టింట్లోంచే...
- నిర్మల్‌లో వాళ్లింట్లోంచి ఆన్‌లైన్లో పరీక్ష రాస్తున్న ఈ బాలిక పేరు వేద. తొమ్మిదో తరగతి పూర్తవడంతో ముందు నుంచే వీరికి పదో తరగతి పాఠాలు చెప్పారు. ఇప్పుడు పదో తరగతి మాదిరి పరీక్షలు రోజూ నిర్వహిస్తున్నారు. సమయం వృథా కాకుండా ఆన్‌లైన్ ద్వారా ముందు రోజే సిలబస్ పంపించడం, తెల్లవారి పరీక్ష నిర్వహిస్తుండడంతో ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థిని వేద, ఆమె తండ్రి స్వామిరెడ్డి అభిప్రాయపడ్డారు.సమస్తం న(నె)ట్టింట్లోంచే...
● ట్యాబ్‌పట్టుకొన్న ఈ చిన్నోడు నిర్మల్‌కు చెందిన ఆరోతరగతి విద్యార్థి వందిత్‌రెడ్ఢి కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా స్కూల్‌కి సెలవులివ్వడంతో ఎక్కువ రోజులు ఆటల్లో నిమగ్నమైతే చదువు పూర్తిగా మరిచి పోతారని పాఠశాల యాజమాన్యం ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తోంది. రోజంతా ఆడుకోకుండా రోజుకొకసారి పరీక్ష పెట్టడం, ఇంట్లోంచే అది రాసేలా ఏర్పాటు చేయడం బాగుందని ఆ బాబు తల్లిదండ్రులు లావణ్య-భూపతిరెడ్డి అంటున్నారు.
అనుమానాలకు ఆన్‌లైన్లోనే నివృత్తి...
![సమస్తం న(నె)ట్టింట్లోంచే...](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6581647_348_6581647_1585467126170.png)
● ఉమ్మడి జిల్లాలో 50 వేలకు పైగా విద్యార్థులు హైదరాబాద్‌లో ఇంటరు చదువుతున్నారు. జేఈఈ పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు చాలా మంది ఉంటారు. కరోనా భయంతో ఇంటికి పంపించేశారు. కానీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రతి కళాశాల వారు పిల్లలు, అధ్యాపకులతో కలిసి వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేశారు. నిత్యం విద్యార్థులతో అధ్యాపకులు మాట్లాడుతున్నారు. అనుమానాలుంటే గ్రూప్‌లో పెడితే నివృత్తి చేస్తున్నారని నిర్మల్‌కు చెందిన ఇంటరు రెండో సంవత్సరం విద్యార్థి అభిజిత్ తెలిపారు.