జొన్న, మొక్కజొన్న పంటలను పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఈ పంటలకు మద్దతు ధరకన్నా చాలా తక్కువగా ప్రైవేటు వ్యాపారులు చెల్లిస్తున్నందున అన్నదాతలు నష్టపోతున్నారు. లాక్‌డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల్లో డిమాండు లేదని వ్యాపారులు గత పదిరోజులుగా ధరలు బాగా తగ్గించేశారు. రేషన్‌కార్డులపై ప్రజలకు నిత్యావసరాల కింద సరఫరా చేసే సరుకుల జాబితాలో ఉన్నవాటినే మద్దతు ధరకు కొంటున్నట్లు కేంద్రం తెలిపింది. కానీ రాష్ట్రంలో ఈ రెండు పంటలనూ రేషన్‌కార్డులపై ప్రజలకు విక్రయించడం లేదని కేంద్రం ఇక్కడ మద్దతు ధరకు కొనడం లేదు.
రాష్ట్రం పూచీకత్తు ఇస్తేనే...
ఈ రెండు పంటలను మద్దతు ధరకు కొనాలని ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించలేదు. ప్రభుత్వం పూచీకత్తు ఇస్తే బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని ఆ సొమ్ముతో ఈ రెండు పంటలూ కొంటామని రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్య(మార్క్‌ఫెడ్) పేర్కొంటోంది. ఇలా కొన్న పంటను కొంతకాలం తర్వాత మార్కెట్లలో అమ్మినప్పుడు నష్టాలొస్తే దానిని భర్తీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఉత్తర్వులోనే తెలపాలి. ఐదేళ్లుగా ఇలా కొన్న వివిధ పంటలను తిరిగి అమ్మినప్పుడు రూ.2,100 కోట్ల నష్టాలొచ్చినా ఆ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఇవ్వలేదు. ఈ అనుభవాల దృష్ట్యా ప్రస్తుతం మార్కెట్లకు వస్తున్న జొన్న, మొక్కజొన్న పంటలను కొనడానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి మార్క్‌ఫెడ్ కనీసం లేఖ రాయలేదు. గతంలో రాసేది. రైతుల ఇబ్బందులను ప్రభుత్వమే నేరుగా గుర్తించి అనుమతి ఇస్తే అప్పుడు కొందాంలే అన్న ధోరణిలో ఉంది. ‘‘ఈ రెండు పంటలను కొనాలంటే తక్షణం వెయ్యి కోట్లు కావాలి. తమ సంస్థ వద్ద నిధులు లేవు. ప్రభుత్వం అనుమతి, పూచీకత్తు ఉత్తర్వులిస్తేనే కొనగలం’’ అని మార్క్‌ఫెడ్ వర్గాలు ‘ఈటీవీ భారత్’కు చెప్పాయి. అటు ప్రభుత్వం గుర్తించి అనుమతి ఇవ్వలేదు... ఇటు మార్క్‌ఫెడ్ లేఖ కూడా రాయని పరిస్థితుల్లో వ్యాపారులు తక్కువ ధరకు కొంటూ రైతులను నష్టపరుస్తున్నారు.
తెలంగాణలో పరిస్థితి ఇలా...
జొన్నలకు క్వింటాకు రూ.2,640 చొప్పున మద్దతు ధర ఇవ్వాలని కేంద్రం ఆదేశించింది. వ్యాపారులు రూ.1,200 నుంచి 1,400 మాత్రమే ఇస్తున్నారు. గత యాసంగి(అక్టోబరు నుంచి మార్చి) వరకూ రాష్ట్రంలో లక్షా 19వేల 597 ఎకరాల్లో జొన్న సాగుచేయగా 93 వేల టన్నుల దిగుబడి వచ్చిందని మార్కెటింగ్‌శాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఇక మొక్కజొన్న సాగు వద్దని వ్యవసాయశాఖ చెప్పినా రైతులు 4.66 లక్షల ఎకరాల్లో వేయగా 13.07 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. మక్కలకు మద్దతు ధర క్వింటాకు రూ.1,850 చొప్పున ఇవ్వాలని కేంద్రం చెప్పినా కేవలం రూ.1,200 నుంచి 1,500లోపే ఇస్తున్నారు. ఇప్పటికే వ్యాపారులు తక్కువ ధరకు 4.90 లక్షల టన్నులు కొనేశారు. ఇంకా పెద్దయెత్తున పంట మార్కెట్లకు వస్తోంది. బిహార్‌లో పంట ఇప్పుడు కోతకు వస్తోందని, అది కూడా మార్కెట్లకు వస్తే దేశంలో ధరలు ఇంకా పడిపోతాయని మార్కెటింగ్‌శాఖ తాజా అంచనా.
నెల నుంచి ఎదురుచూపులు
రెండెకరాల్లో జొన్న సాగుచేస్తే 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. రూ.20 వేలు పెట్టుబడి పెట్టా. నెల రోజుల నుంచి మార్కెట్ ఆవరణలోనే ఆరబోశా. ఎండలకు ఎండుతూ, వానలకు తడుస్తూ పాడవుతున్నాయి. వ్యాపారులు క్వింటాకు రూ.1,200 మాత్రమే ఇస్తామని అంటున్నారు. ఆ ధరకు అమ్మితే మాకేం మిగలదు.- బి.రామయ్య, జొన్న రైతు, బోథ్, ఆదిలాబాద్ జిల్లా
ఇదీ చదవండి: Covid Bills: కొవిడ్ రోగుల ప్రాణాలు తీస్తోన్న ప్రైవేట్ ఆస్పత్రుల బిల్లులు