Video Viral: ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కప్పర్ల గ్రామ శివారులో చిరుతపులి హల్చల్ చేసింది. గ్రామానికి చెందిన రైతు పరమేశ్వర్ చెందిన పొలంలో.. జొన్న పంట వేయగా అది కోతకు వచ్చింది. ఈ రోజు హర్వేస్టర్‌తో పంటను కోస్తున్న సమయంలో.. చేనులో ఒక్కసారిగా చిరుతపులి దర్శనమిచ్చింది. పులిని చూసి ఉలిక్కిపడ్డ రైతులు.. ఒక్కసారిగా అరవటం ప్రారంభించారు. వారి అరుపులు విన్న చిరుత.. పరుగులు పెట్టింది. హర్వెస్టర్ యంత్రంతో పులిని వెంబడించగా.. భీంపూర్ మండలం గుబిడిపల్లి, వడ్‌గాం ప్రాంతంలోని అటవీప్రాంతంవైపు పరుగు తీసింది.
చిరుత సంచారంతో సమీపగ్రామాల ప్రజలు భయాందోళనకు గురికాగా.. అటవీ అధికారులకు కప్పర్ల సర్పంచ్ సదానందం సమాచారం అందించారు. గ్రామస్థుల పరిస్థితిని వివరించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఎఫ్‌ఎస్‌వో ప్రేంసింగ్, బీట్ అధికారి శరత్‌రెడ్డి.. చిరుత కనిపించిన పంటచేలును సందర్శించారు. గ్రామస్థులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. తాంసి, తలమడుగు, భీంపూర్ మండల పరిసరాల్లో ఏడాదిగా తిరుగుతున్న చిరుతపులి ఇదేనని గుర్తించారు. గ్రామస్థులు, రైతులు ఆందోళన చెందవద్దని.. జనాలను చిరుత ఏమి అనదని భరోసానిచ్చారు.
పంటచేనులో చిరుత పరుగులు పెట్టిన దృశ్యాలు సామాజికమాద్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇన్నాళ్లు చిరుత కనిపించిందన్న ఒకరిద్దరి మాటలను కొట్టిపారేసి పొలాలకు ధైర్యంగా వెళ్లిన రైతులు.. ఇప్పుడు ఆ దృశ్యాలు చూసి వణికిపోతున్నారు.
ఇవీ చూడండి: