Interesting Digging: ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలం కుప్టి సమీపంలో జాతీయ రహదారికి ఆనుకొని దాదాపు 100 మీటర్ల దూరంలో జరిగిన ఓ ఘటన అందరికీ ఆసక్తితో పాటు ఆందోళన కలిగించింది. సోమవారం(జనవరి 17) ఉదయం 6 గంటల ప్రాంతంలో ఒక జేసీబీతో పాటు ఓ ఓమ్ని వాహనంలో ఐదురుగు వచ్చారు. అక్కడ జేసీబీతో ఓ గుంత తవ్వారు. వెంటనే పూడ్చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఓవైపు ఆసక్తి.. మరోవైపు ఆందోళన..
ఇదంతా.. అక్కడే పొలం పనులు చేసుకుంటున్న కొందరు రైతులు గమనించారు. అక్కడ ఏం చేస్తున్నారో ఉహించేలోపు వచ్చిన వాళ్లు వెళ్లిపోయారు. దీంతో వాళ్లలో ఓవైపు ఆసక్తి.. మరోవైపు ఆందోళన.. రెండూ ఒకేసారి మొదలయ్యాయి. అసలు వచ్చింది ఎవరు..? ఎందుకు తవ్వారు.. మళ్లీ ఎందుకు పూడ్చేశారు..? అక్కడ ఏముంది..? ఇలాంటి ప్రశ్నలు ఒకటి తర్వాత మరోకటి పుట్టుకొస్తున్నాయి. ఎవ్వరికీ ఏమీ అర్థం కాకపోవటం వల్ల.. వాళ్ల ప్రశ్నలకు సమాధానాలు ఊహించలేకపోతున్నారు.
ఎంత తవ్వినా దొరకని సమాధానం..
ఎందుకైనా మంచిదని.. అక్కడున్న స్థానికులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. గ్రామ పంచాయతీ కార్మికులతో తవ్వకాలు ప్రారంభించారు. ఉదయం 10 గంటల నుంచి తవ్వుతూనే ఉన్నారు. కాసేపటికి వాళ్లు అలసిపోవడంతో.. ఓ జేసీబీ సహాయంతో తవ్వించారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో గుంతను తీయగా.. చూసేందుకు చుట్టుపక్కల నుంచి వందలాది జనం చుట్టు ముట్టారు. అసలు ఆ గుంతను ఎందుకు తవ్వారు..? ఏదైనా బయటపడుతుందా..? తవ్వింది గుప్త నిధుల కోసమా..? లేక ఇంకేమైనా కారణం ఉందా..? తవ్వుతున్నంత సేపు జనాల మెదళ్లలో మెదులుతున్న ప్రశ్నలు. సమాధానం దొరుకుతుందని ఆశగా ఎదురుచూసిన వారికి చివరి వరకు.. ఏమీ బయటపడకపోవటం వల్ల.. నిరాశే ఎదురైంది. ఇక చేసేదేమీ లేక అధికారులు సైతం వెనుదిరిగారు.
స్థానికుల్లో అయోమయాన్ని నింపిన ఈ ఘటనపై ఓ స్పష్టత రావాలంటే.. పోలీసులు విచారించి అసలు విషయం తెలుసుకునే వరకు వేచి చూడాల్సిందే..!
ఇదీ చూడండి: