Heavy Rains In Joint Adilabad Districts : రాష్ట్రవ్యాప్తంగా గత నాలుగు రోజు నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చిత్తయింది. ఎక్కడికక్కడ జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో జిల్లాలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని పలు మండలాల్లో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. నెన్నేల మండలం లంబడి తండాలోలని ఎర్రవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. దీంతో 9 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు ఇప్పటికే ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అలాగే చెన్నూర్ మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు 63వ జాతీయ రహదారి మార్గంలో అక్కెపల్లి బతుకమ్మ వాగు వద్ద ప్రమాదకరంగా మారింది. భారీ వర్షాలకు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో వాగుపై నిర్మించిన బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు భారీగా కోతకు గురై ప్రమాదపు అంచుకు చేరుకుంది. కోటపల్లి మండలంలోని అంతరాష్ట్ర సరిహద్దు బ్రిడ్జి, అన్నారం సరస్వతి బ్యారేజ్‌లను సీపీ సందర్శించి ప్రాణహిత నది వరద ఉద్ధృతిని రామగుండం సీపీ పరిశీలించారు.
వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన తాత్కాలిక వంతెన : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో 3 రోజుల నుంచి కురిసిన వర్షాలకు పలు వాగులు వంకల్లో భారీగా వరద నీరు చేరింది. దీంతో బ్రాహ్మణపల్లి-నక్కలపల్లి రామాల మద్యలోని గొల్లగట్టు వాగు ఉద్ధృతికి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన వంతెన కొట్టుకుపోయింది. దీంతో కోటపల్లి మండలం బ్రాహ్మణపల్లి , వేమనపల్లి మండలం చామనపల్లి, బాదంపల్లి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
సింగరేణికి రూ.23 కోట్ల నష్టం : నాలుగు సింగరేణి ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మందమర్రి ఏరియాలోని కళ్యాణి ఖని, రామకృష్ణాపూర్ ఉపరితల గనులు, శ్రీరాంపూర్ ఏరియాలోని శ్రీరాంపూర్ ఇందారం ఖని ఉపరితల గనుల్లో నాలుగు రోజులుగా 92వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. దీంతో సింగరేణికి సుమారు రూ.23 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు.
కుమురం భీం ఆనకట్టకు పగుళ్లు : కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో అడగ్రామం వద్ద పెద్దవాగుపై నిర్మించిన కుమురం భీం ప్రాజెక్టు గత ఏడాది కురిసిన వర్షాల కారణంగా ప్రాజెక్టు ఆనకట్ట సైడ్ వాలు దెబ్బతిని పడిపోయింది. దీంతో ఆనకట్ట పగుళ్లు తేలింది. ఈ వర్షాలకు ఎప్పుడు ఏం జరుగుతుందోనని దిగువ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద నీరు : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి జలాశయానికి వరద నీరు పోటెత్తుతుంది. ఎగువ ప్రాంతంలో ఉన్న కడెం జలాశయంగేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతుండడంతో పాటు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుకోవడంతో శుక్రవారం మధ్యాహ్నం జలాశయం గేట్లను ఎత్తి దిగువకు నీరు వదిలే అవకాశం ఉందని గోదావరి పరివాహక ప్రాంతాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు గత ఏడాదిని గుర్తు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు.
కడెం జలాశయానికి భారీగా వరద నీరు : నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయానికి వరద నీరు చేరడంతో.. 18 గేట్లకు గానూ 11 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేశారు. మిగిలిన ఏడు గేట్లలో మూడు గేట్లు మొరాయించాయి. మరో నాలుగు గేట్లను హైండిల్ ద్వారా తెరిచేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో సాయంత్రానికి వరద పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జలాశయ పరిస్థితులను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఈఈ విఠల్ చేరుకొని పరిశీలిస్తున్నారు.
ఇవీ చదవండి :