ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. జిల్లా కేంద్రంలోని రహదారులు పూర్తిగా జలమయమాయ్యాయి. రోడ్లపై ఉన్న గుంతల్లో వరద నీరు చేరి రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. పట్టణ వాసులు ఇళ్లకే పరిమితం అయ్యారు. అక్కడక్కడ జనాలు గొడుగులతో కనిపించినా.. ఉదయం నుంచి రహదారులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి.
జిల్లా అంతటా వర్షం ఉండటంతో కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదైనా సమస్య వస్తే 18004251939 టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రకటించారు. జిల్లాలోని పరిస్థితిపై తహసీల్దార్, ఇతర అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.