Heavy Rains In Adilabad District : జోరు వానలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం కుమురం భీం జిల్లా సిర్పూర్-(యూ)లో 23.15 సెంటిమీటర్లుగా నమోదైంది. ఈ జిల్లాలోని వాంకిడీ మండలం బోర్డా వాగులో కాలకృత్యాల కోసం వెళ్లిన అదే గ్రామానికి చెందిన శెండె అంజన్న గల్లంతయ్యారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం వడూర్ ఆనుకొని ఉన్న పెన్‌గంగ ఒడ్డున ఉన్న పడవను తీసుకురావడానికి వెళ్లిన దాదీబా, కుశాల్, శ్రీనివాస్ వరద ప్రవాహంలో చిక్కుకోవడం కలకలం సృష్టించింది. చివరికి జైనథ్ సీఐ నరేష్, భీంపూర్ ఎస్సై రాధిక నేతృత్వంలో ప్రత్యేక టైర్లు, ట్యూబుల సహకారంతో ముగ్గురిని బయటకు తీసుకు రావడంతో ప్రమాదం తప్పింది. ఈ మండలంలో దాదాపుగా 30 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
Rain Alert To Adilabad : తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని పెన్‌గంగ సహా వాగులు, ఒర్రెలు ఉద్ధృతంగా ప్రవహించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఉత్తర-దక్షిణ భారతాన్ని అనుసంధానం చేసే జైనథ్ మండలం డొల్లార వద్ద 50 అడుగుల ఎత్తుతో ఉన్న వంతెనను తాకుతూ పెన్‌గంగ ఉప్పొంగడంతో అధికార యంత్రాంగం రాకపోకలను నిలిపివేసింది. భోరజ్ అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి వరద ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పెన్‌గంగ నది తీవ్రతను పరిశీలించి ముందస్తు చర్యల్లో భాగంగా ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలను పంపించాలని ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు.
Pen Ganga Flowing At Height Of 50 Feet : ఆదిలాబాద్‌లోని జీఎస్ ఎస్టేట్, బంగారుగూడ, ఖానాపూర్, వికాలంగుల కాలనీలు సహా శివారు ప్రాంతాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ప్రజలకు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మహాలక్ష్మి వాడలో వరద ఉద్ధృతికి సగం వంగిపోయిన స్తంభానికి విద్యుత్ సరఫరా ఉండటంతో స్థానికులు భయాందోళనకు లోనయ్యారు. చివరికి విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ నంద సరఫరాను ఆపివేయడంతో ప్రమాదం తప్పింది.
కడెం ప్రాజెక్టుకు భారీగా వర్షపు నీరు : నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరినప్పటికీ.. 18 గేట్లలో 14 గేట్లు తెరిచారు. సాంకేతిక కారణాలతో మరో 4 గేట్లు తెరుచుకోలేదు. ఏజెన్సీ పరిధిలోకి వచ్చే ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, సిర్పూర్(యూ), గాదిగూడ, తిర్యాణి మండలాల్లో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎల్లంపల్లి, మత్తడివాగు, సాత్నాల, పీపీరావు, ఆడ, గడ్డెన్న, స్వర్ణ, బజార్‌హత్నూర్ జలాశయంలోకి వరద పోటెత్తింది.
Heavy Crop Loss Due To Rains : ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్షన్నర ఎకరాల్లో పంట నీట మునిగింది. ఒక్క పెన్‌గంగ నదీ పరివాహక ప్రాంతాల్లో దాదాపుగా 50 వేల ఎకరాల్లో పంట నీట మునిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా వేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమురం భీం జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం అధికారులు కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి :