కరోనా మహమ్మారి కారణంగా పనుల్లేక ఆర్థికంగా చితికిపోయి.. రేషన్ కార్డు లేకపోవడం వల్ల ప్రభుత్వ సరకులు అందని పేదలు, ఆపన్నులకు అతివలు చేయూతనందించారు. పేదరికంలో ఉన్న వారి ఆకలి తీర్చడానికి వరంగల్ జిల్లా పాలనాధికారి శ్రీదేవసేన ‘'నా వంతు'’ కార్యక్రమంలో భాగంగా పల్లెల్లో డీఆర్‌డీఏ, పట్టణంలో మెప్మా పరిధిలోని స్వయం సహాయక సంఘాల సభ్యులు నిత్యావసర సరకులు సేకరించారు. రేషన్ బియ్యం తీసుకున్న వారు, ఆర్థికంగా ఉన్న వారు సహాయం చేసి దాతృత్వాన్ని చాటుకున్నారు. నెల రోజుల్లో 200క్వింటాళ్లకు పైగా బియ్యం, కందిపప్పు, ఇతర సరకులు సేకరించి పేదలకు అందించారు.
రేషన్ కార్డు లేనివారికి అండగా..
జిల్లాలో రేషన్‌కార్డు లేనివారు అనేక మంది ఉన్నారు. చాలామంది పేదలు, వలస వచ్చిన కుటుంబాలకు తినడానికి తిండి లభించని పరిస్థితి ఏర్పడింది. వీరికి బియ్యం అందించడానికి గ్రామీణాభివృద్ధిశాఖ ‘'నా వంతు'’ పేరిట వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా గ్రామాల్లో ఉన్న స్వయం సహాయక సంఘాల సభ్యులు స్థానికుల వద్ద బియ్యం, కందిపప్పు, జొన్నలతో పాటు నగదు సేకరించారు. సేకరించిన నిత్యావసర సరకుల్లో 80శాతం పేదలకు పంపిణీ చేసినట్లు జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖాధికారి రాఠోడ్ రాజేశ్వర్ తెలిపారు.
ఇదీ చూడండి:ప్రధానికి ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు..?