విద్యకే పెద్దపీఠ అన్నది అక్షరాలా నిజం చేస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ఓ చిన్న గిరిజన గ్రామమైన గేర్జం గ్రామస్థులు. గేర్జంలోని యువత వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామంలో ఒకరో ఇద్దరో కాదు.. పదుల సంఖ్యలో ఉద్యోగస్థులు ఉన్నారంటే ఆశ్చర్యం కలగక మానదు మరి.
ఎంతకష్టమైనా సరే తమ పిల్లలకు మంచి విద్యను, పరిశుభ్రతను, పచ్చదనాన్ని ఇవ్వాలని కలలు కంటారు. గ్రామ పాఠశాలను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తుంటారు. గ్రామ ప్రజలంతా ఐక్యంగా ఉంటూ ఊరి సమస్యలను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పరిష్కరించుకుంటారు. ఉన్నత విద్య కోసం పిల్లలను హైదరాబాద్, వరంగల్ ఇలా రాష్ట్రంలోని వివిధ పట్టణాలకు పంపిస్తారు. పిల్లలు కూడా కన్న వారి కలలను సర్కారీ కొలువుల రూపంలో నిజం చేస్తారు.
ఆ గ్రామంలోనే అన్ని సమస్యలు పరిస్కరించుకోవచ్చంటే నమ్మరేమో కానీ నిజం ఎందుకంటే ప్రతి ప్రభుత్వ రంగంలో అక్కడి యువత ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు.. వైద్యవృత్తి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, ఆర్మీ, కానిస్టేబుల్స్, పశు వైద్య, ఆరోగ్య శాఖ, వ్యవసాయ శాఖ తదితర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇక్కడి యువత కొలువు దీరి ఉన్నారు. చదువుకున్న యువత సాయంతో ఇప్పుడిప్పుడే తమ గ్రామం అభివృద్ధి చెందుతుందని గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చూడండి : దిల్లీ తీర్పు: హస్తినను మరోసారి ఊడ్చేసిన ఆప్