వినాయక నవరాత్రులు వస్తున్నాయంటే చాలు ఆ ఆనందం వేరుగా ఉంటుంది. రంగు రంగుల విద్యుత్ కాంతుల మధ్య రకరకాల ఆకృతుల్లో పూజలందుకునే గణపయ్యను చూడడానికి రెండు కళ్లు చాలవు. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసే భారీ ప్రతిమలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. దీనికి భిన్నంగా మట్టితోనే భారీ విగ్రహాలు తయారు చేస్తూ అబ్బుర పరుస్తున్నారు ఆదిలాబాద్‌కు చెందిన శివాజీ, గజానన్ అనే మిత్రులు. కొంత మంది స్నేహితులతో కలిసి మట్టి గణనాథులను రూపొందిస్తున్నారు.
పదేళ్ల నుంచి మట్టి విగ్రహాలే...
ఆదిలాబాద్‌కు చెందిన శివాజీ, గజానన్లు గత పదేళ్ల నుంచి మట్టితోనే వినాయక విగ్రహాలను తయారు చేస్తున్నారు. వినాయక మండపాల నిర్వాహకుల కోరిక మేరకు ఓ ఏడాది ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో అయిదు విగ్రహాలు తయారు చేసినప్పటికీ ఆ తరువాత వాటి జోలికి పోలేదు. ప్రథమ దేవుని పూజకు మట్టి విగ్రహాలే శ్రేష్టమైనవిగా భావించి వాటి తయారీకే మొగ్గు చూపుతున్నారు. మట్టితో భారీ విగ్రహాలు తయారు చేస్తూ... ఇటు భక్తిని... అటు పర్యావరణ హితాన్ని చాటి చెబుతుండడం విశేషం.
కష్టమైనా... ఇష్టంగా...
ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో పోలిస్తే మట్టి విగ్రహాల తయారీ కొంచెం కష్టమే. ఎర్రమట్టి, ఎండిన గడ్డిని సమకూర్చుకుని... వాటిని చూర్ణంగా మార్చి నీళ్లతో పేస్టులాగా తయారుచేయాలంటే ఒక్కరోజులో అయ్యే పనికాదు. అందుకు అనుగుణంగా ఈ కళాకారులు వేసవిలోనే మహారాష్ట్ర నుంచి ఎర్రమట్టిని తెచ్చి చూర్ణంగా చేసి బస్తాల్లో నిల్వ చేస్తారు. నవరాత్రులకు సమయం దగ్గరవుతున్న కొద్దీ విగ్రహాల తయారీకి శ్రీకారం చుడతారు. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కన్నా మట్టి విగ్రహాలపై గణేష్ మండపాల నిర్వహకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రభుత్వం మట్టి విగ్రహాల తయారీకి తగిన ప్రోత్సాహం ఇస్తే.. వీటి వినియోగం ఇంకా పెరుగుతుందని తయారీ దారులు అంటున్నారు.
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వినాయక నవరాత్రులను అత్యంత భారీగా నిర్వహించే ఆదిలాబాద్ పట్టణంలో అధికంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలే వినియోగిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మూల విగ్రహ పూజకోసం మట్టి గణపయ్యలనే వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మట్టి విగ్రహాలకు ఆదరణ పెరుగుతోంది.
ఇదీ చూడండి : ఈ శివలింగం ఎదురుగా రెండు నందులుంటాయి...