ఆదిలాబాద్ జిల్లా దిలావర్‌పూర్‌లో కడు పేదరికంలో ఉన్న భూమవ్వకు రేషను కార్డు ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా ఎలాంటి సరకులు అందడం లేదు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా కనికరించే వాళ్లు కరవయ్యారు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో విషయం తెలిసినా ఆ కాలనీ యువకుడు రమాకాంత్ వృద్ధురాలి పరిస్థితిని ‘ఈనాడు- ఈటీవీ భారత్’ దృష్టికి తెచ్చారు. సమస్య పరిష్కారం కోసం అధికారులను సంప్రదించగా ఆసక్తికర విషయం వెలుగు చూసింది.
ఎఫ్‌ఎస్‌సీ వైబ్‌సైట్‌లో రేషను కార్డు, ఆధార్ కార్డు వివరాలు ఎస్‌కేఎస్ నమోదులో పరిశీలించగా భూమవ్వ మృతి చెందినట్లు ఉండటం గమనార్హం. ఈ విషయమై దిలావర్‌పూర్ తహసీల్దార్ సంతోష్‌రెడ్డిని సంప్రదించగా అది ఎప్పుడు జరిగిందో తమకు తెలియదని, ప్రస్తుతం ఆ వెబ్‌సైట్‌ని ప్రభుత్వం నిలిపివేసిందని ఇప్పుడు ఏమీ చేయలేమన్నారు. ఆమెకు తమ వంతు సహాయంగా 10 కిలోల బియ్యం అందిస్తామన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.