Farmers Cricket: నేల తల్లిని సాగు చేసి బంగారం లాంటి పంటలు పండించడమే కాదు.. క్రికెట్ మైదానంలో బ్యాట్ ఝుళిపించడమూ, బంతిని పరుగులు పెట్టించడమూ మాకొచ్చు అని నిరూపించారు ఐదు పదుల వయసులో ఉన్న ఈ రైతన్నలు. పదిమందికి అన్నం పెట్టే అన్నదాతలు.. సరదాగా గ్రౌండ్లోకి దిగి స్థానికుల దృష్టిని ఆకర్షించారు. ఆటలో ఏ మాత్రం అనుభవం లేకున్నా.. తమదైన శైలిలో ఆడి మెప్పించారు. ఈ వయసులోనూ యువతతో పోటీ పడి శెభాష్ అనిపించారు ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం రైతన్నలు. ఎప్పుడూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యే కర్షకులు.. సరదాగా బ్యాట్ పట్టి ఆడినంత సేపూ ఓ ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని కల్పించారు.
పంచెకట్టుతోనే
సంక్రాంతి పండుగ సందర్భంగా స్థానిక లాల్‌పిచ్ మైదానంలో క్రికెట్ పోటీలు జరుగుతుండగా.. పక్కనే పంట చేలలో పనులకు వచ్చిన రైతులు ఆటను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన నిర్వాహకులు మీరూ ఓ ఆట ఆడతారా? అని సరదాగా రైతులను అడిగారు. అంతే పంచెకట్టుతోనే మైదానంలోకి అడుగుపెట్టారు.
ఓడినా.. గెలిచారు
తొలుత బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు 8 వికెట్లకు 59 పరుగులు చేయగా.. ఆ తర్వాత అన్నదాతల జట్టు 54 పరుగులు చేసి ఐదు పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. అయితేనేమి వారి ఆట తీరుకు అక్కడున్నవారు ఆకర్షితులయ్యారు. వారి అంకితభావం, పట్టుదల చూసి స్ఫూర్తి పొందారు. ఆట జరుగుతున్నంత సేపూ.. రైతులు మైదానంలో చురుగ్గా ఉంటూ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ప్రత్యేకతను చూపి అందరి మనసులను గెలిచారు.
ఇదీ చదవండి: 'రైతు బంధుని కాపీ కొట్టి ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారు'