అధికారులమని చెప్పి వసూళ్లకు పాల్పడిన నకిలీ అధికారులను పోలీసులు పట్టుకున్నారు. ఎన్జీవో కన్జ్యూమర్ అధికారుల మంటూ గురువారం పలువురు ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో కొన్ని దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. దుకాణాలకు సంబంధించిన లైసెన్సులు, కాగితాలు ఉన్నాయా, దుకాణాల ముందు కరోనాను నివారించేందుకు శానిటైజర్లు ఏర్పాటు చేయడం లేదని బెదిరించారు. మాస్కులు ధరించడం లేదని, అందుకు మీరు ఫైన్ చెల్లించాలని.. లేదంటే కేసు నమోదు చేస్తామని వారు తెలిపారు.
నగదు ఇవ్వాలని..
కేసులు లేకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా రూ.25 వేల నగదు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. అంత చెల్లించే స్థాయి మాకు లేదని వారు చెప్పడం వల్ల కొంత నగదు ఇవ్వాలని అన్నారు. మూడు దుకాణాల యజమానులు రెండు వేలకుపైగా అందించారు. రసీదు ఇవ్వాలని దుకాణ యజమానులు అడగడం వల్ల తిరిగి వచ్చే ముందు ఇస్తామని చెప్పారు. అక్కడి నుంచి చౌరస్తాలో బేకరీకి వెళ్లి ఆయనను బెదిరించగా ఆ యజమాని పసిగట్టాడు. వెంటనే స్థానిక ఎస్ఐ విజయ్ కుమార్కు సమాచారం అందించారు.
తనిఖీలు చేయగా..
గమనించిన ఓ నిందితుడు వెంటనే వాహనంలో పారిపోయారు. పోలీసులు పలుచోట్ల తనిఖీలు చేయగా చించూఘాట్ వద్ద వారిని పట్టుకున్నారు. నిందితులు ముడుగు అమృతరావు, ముడుగు అఖిల్, లింగంపల్లి లక్ష్మణ్, విజయ్, విజయ్ కుమార్లుగా గుర్తించారు. బాధితుడు శివ విజయ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్టు ఎస్సై విజయకుమార్ తెలిపారు.
ఇదీ చూడండి : మేడ్చల్ జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం.. 10 గుడిసెలు దగ్ధం..