లాక్‌డౌన్ నిబంధనల సడలింపు తర్వాత నుంచి విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని ఆదిలాబాద్ జిల్లాలో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కసారే ఎక్కువ మొత్తంలో వస్తున్న బిల్లును చూసి ఖంగుతింటున్నారు. విద్యుత్ బిల్లు రీడింగ్ నమోదుపై జిల్లా వాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఆ మీటర్లు లేకనే తప్పులా...!
ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా టెండరు దక్కించుకున్న గుత్తేదారులతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది పర్యవేక్షణలో రొటేషన్ పద్ధతిలో విద్యుత్ రీడింగ్ చేయాల్సి ఉంది. ఇందులో గుత్తేదారు ద్వారా 67శాతం, విద్యుత్ సిబ్బంది నేతృత్వంలో 33శాతం రీడింగ్ తీయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రెండు నెలలకోసారి, పట్టణ పరిధిలో నెలనెలా బిల్లులను పంపిణీ చేస్తారు. ప్రతి వినియోగదారునికి ఇన్‌ఫ్రా రెడ్ డాటా ఎనాలసిస్ (ఐఆర్‌డీఏ) మీటర్లు అమర్చి.... స్పాట్ బిల్లింగ్ పరికరంతో రీడింగ్ తీస్తే తప్పులు లేకుండా కచ్చితమైన బిల్లు వస్తుంది.కానీ.. వినియోగదారులందరికీ ఐఆర్‌డీఏ మీటర్లు లేనందున తప్పులు దొర్లడానికి ఆస్కారం ఏర్పడుతోంది.
వందల్లో బదులు వేలల్లో బిల్లులు
జిల్లాలో లక్షా 85వేల మీటర్లు కేటగిరి-1 కిందకు వచ్చే గృహావసరాలవి ఉంటే, మరో 18,188 మీటర్లు కేటగిరి-2కిందకు వచ్చే వాణిజ్యపరమైనవి ఉన్నాయి. వాణిజ్యపరమైన మీటర్లలను మినహాయిస్తే ..., చాలా సందర్భాల్లో గృహవినియోగానికి ఉపయోగించే మీటర్లకే అధిక బిల్లులు రావడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. నెలకు వందల్లో వచ్చే బిల్లు ఏకంగా వేలల్లో రావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
జిల్లాలో పూర్తిస్థాయిలో ఐఆర్‌డీఏ విధానం అమలు కాకపోవడం వల్లే సమస్యలు తలెత్తుతున్నట్లుగా గుర్తించిన అధికార యంత్రాంగం... కరోనా లాక్‌డౌన్ సమయంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా జరిగినట్లు భావిస్తోంది. సిబ్బంది ద్వారా తప్పుజరిగితే తప్పకుండా చర్యలు ఉంటాయని వినియోగదారులకు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ప్రభుత్వం కల్పించిన నిబంధనలతో 100లోపు యూనిట్ల విద్యుత్ వినియోగానికి వెసులుబాటు కలిగిన ఎస్సీ, ఎస్టీ వినియోగదారుల జాబితానూ పరిశీలించే ప్రయత్నం చేస్తోంది.