రోజురోజుకు పెరుగుతోన్న కరోనా కేసుల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయ అధికారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ అదే జాగ్రత్త మితిమీరి.. ప్రజలెవరూ ఆఫీసులకు రాకుండా ఉండడానికి తీసుకుంటే సామాన్య ప్రజానీకానికి తీవ్ర ఇబ్బందిగా గోచరిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య 170కి చేరుకుంది. ఇందులో మంచిర్యాల జిల్లాలో 94, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 36, ఆదిలాబాద్ జిల్లాలో 22, నిర్మల్ జిల్లాలో 18 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెజ్జూరు, దహేగాం, జైనూర్, నిర్మల్, భైంసా లాంటి ప్రాంతాల్లో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. రోజువారీ భూ సమస్యలు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు.. తహసీల్దార్ కార్యాలయాలకు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకోవడం చర్చనీయాంశమవుతోంది. అత్యవసరమైన పనులైతే మెయిల్ చేయండని... కార్యాలయాల్లో నోటీసులు అతికించడమే కాకుండా... సాధారణ సమస్యల దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక డబ్బాలు ఏర్పాటు చేయడం వల్ల వివిధ పనుల కోసం వచ్చే ప్రజలు వెనుదిరగాల్సి వస్తోంది. సాధారణ సమయాల్లోనే స్పందించని అధికారులు... ఇక డబ్బాల్లో వేసే దరఖాస్తులను చూస్తారా... అనే ఆవేదన ప్రజల్లో గూడుకట్టుకుంటోంది.
ఇదిలా ఉంటే అధికారుల వాదన మాత్రం భిన్నంగా ఉంది. సమస్యల పరిష్కారంలో రెవెన్యూ యంత్రాంగమే కీలకమని పేర్కొంటూ.. చిన్నపనులకు సైతం ప్రజలు కార్యాలయాలకు రాకుండా నియంత్రణ చర్యలు చేపడ్తున్నట్లు వెల్లడిస్తున్నారు. మెయిల్‌లో వచ్చే సమస్యలను మీ సేవ ద్వారా, డబ్బాలో వేసే దరఖాస్తులను ప్రాధాన్యత రీత్యా పరిష్కరిస్తున్నామని తహసీల్దార్ బోజన్న సెలవిస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతు బందు డబ్బులు చాలా మంది ఖాతాల్లో జమకాలేదు. సకాలంలో పహానీలు లభించక పంట రుణాలు అందడం లేదు. వాటి కోసం తహసీల్దార్ కార్యాలయాలకు వస్తోన్న ప్రజలకు అధికారులు తీసుకుంటున్న కరోనా నివారణ చర్యలు నిరాశనే మిగిలిస్తున్నాయి.
ఇదీ చూడండి : రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు