ఇంట్లోనే ఉండండి.. బయటకు రావద్దంటూ దండం పెడతామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తుకుంటున్నా మహానగరాల్లో కూడా జనం యథేచ్ఛగా బయట తిరిగేస్తున్నారు. విదేశాల నుంచి తిరిగొచ్చిన వారు 14రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలని చెప్పినా వినడం లేదు. కానీ మారమూల పల్లెల్లో మాత్రం ఎంతో చైతన్యం కనిపిస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఎమాయికుంట, అందుతండా గ్రామాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు బతుకుతెరువు కోసం ఉగాండా దేశానికి వెళ్లి ఆదివారం స్వస్థలానికి తిరిగి వచ్చారు. వారికి పరీక్షలు నిర్వహించిన స్థానిక వైద్యులు, పోలీసులు 14 రోజులు ఇంట్లోంచి బయటికి రావద్దని సూచించారు. ఎమాయికుంటకి చెందిన వ్యక్తికి ఇంట్లో ప్రత్యేక గదిలేదు. కుటుంబసభ్యులంతా కలిసే ఉంటున్నారు. అతడు ఇంట్లోనే ఉంటున్నా కుటుంబ సభ్యులు బయటికొచ్చి గ్రామంలో తిరుగుతుండడంతో గ్రామస్థులు కొందరు ఒక వినూత్న మార్గం ఆలోచించారు.
కొన్నాళ్లపాటు వారికి దూరంగా ఉండడం కోసం ఈ గ్రామంలోని మొత్తం 120 కుటుంబాల్లో 25 కుటుంబాల వారు పిల్లపాపలతో తామే పొలాల్లో చేరి గుడారాలు వేసుకుని ఉంటున్నారు. ముందు జాగ్రత్తగా ఇలా చేస్తున్నారని సర్పంచి జాదవ్ లఖన్ తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఈ మార్గం ఎంచుకున్నామని ఎంపీటీసీ సభ్యుడు విజయ్‌సింగ్ వివరించారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471