ప్రకృతి రమణీయమైనదే. దానికీ కాలపరీక్ష తప్పదేమో. వరుణుడి పలకరింపుతోనే ఆకుపచ్చచీర కట్టుకున్నదా..? అనేట్లు ఉండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవంతా.. వేసవి ఆరంభంతో ఆకురాలిపోయి... బోసిపోతోంది. కానీ అదే సమయంలో పూసే మోదుగుపూలతో కొత్త అందాన్ని సంతరించుకుంటోంది. మోదుగుపూలు పూయడం మంటేనే రంగులకేలి... హోలీ వచ్చేసిందనే సంబురం ఊరు,వాడా కనిపిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా లోహర అటవీప్రాంతం, కవ్వాల్ అభయారణ్యం, ఆసిఫాబాద్, కోసాయి, ఉట్నూర్, అల్లంపల్లిలోని దట్టమైన అడవిలో పూసే మోదుగపూల అందం కనువిందుచేస్తోంది. ఈ పూలతోనే ఏజెన్సీలో రంగులు తయారుచేసుకొని హోలీని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
మోదుగపూల సంబురంపై ప్రభావం
కాలానికి అనుగుణంగా అందాలను సంతరించుకునే అడవిలో టేకుపూలు పూయడంతో వినాయకచవితి వచ్చిందనీ, మోదుగపూలు పూయడంతో హోలీ పండుగ వచ్చేసిందనే సంకేతం జిల్లా ప్రజలను ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది. అక్షరాస్యులు, నిరక్ష్యరాస్యులు అనే తేడాలేకుండా మంత్రముగ్ధులను చేస్తోంది. కానీ ఏడాది తీవ్ర వర్షాభావంతో పాటు కరోనా మహమ్మారి విజృంభణ... మోదుగపూల సంబురంపైకూడా తీవ్ర ప్రభావం చూపింది. ప్రకృతి ప్రేమికులకు సైతం కాలపరీక్షగా నిలిచింది.
కళతప్పిన రంగుల పండగ
ఎరుపు, పసుపు రంగులను అద్దుకునే మోదుగుపూల సొగసు... కనువిందు చేస్తుంటే.... ఆర్ధికస్థితిగతులతోనే పండుగ సంబురంలేదనే భావన పల్లెప్రజలను పట్టిపీడిస్తోంది. పైగా మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కరోనా మహమ్మారి... కోరలు చాస్తోంది. సకాలంలో వర్షాలు పడి, పంటలు బాగా పండితే పండగ సంతోషం ఉంటుంది... కానీ కాలం కలిసిరాక ఉన్నదాంట్లోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందనే ఆవేదన ఆదివాసీ పల్లెల్లో వినిపిస్తోంది.
మోదుగ పూల రూపంలో..
కరవుకాటకాల్లోనూ ఆనవాయితీగా వచ్చే హోలీ వేడుకల్లో అటవీ సంపద ఎంతో కొంత కొత్తదనం నింపుతోంది. మోదుగ పూల రూపంలో ఆనందాన్ని పంచుతోంది.
ఇదీ చదవండి: ఎంఎంటీఎస్ రెండో దశ పనులు వేగవంతం