సూర్యుడి ఉగ్రరూపానికి అడవుల జిల్లా అల్లాడిపోతోంది. ఉమ్మడి జిల్లాల్లోని 86 ఆటోమెటిక్ వెదర్ స్టేషన్ల పరిధిలలో పగటి ఉష్ణోగ్రత 44 డిగ్రీలు నమోదయ్యాయి. అత్యవసరం అయితే రక్షణ కవచాలు ధరించి బయటకు వస్తున్నారు. గది ఉష్ణోగ్రత సైతం 42 నుంచి 44 వరకు నమోదు కావడంతో ఏసీల వినియోగం పెరిగింది. ఎండ తీవ్రతకు ల్యాప్‌టాప్‌లు, చరవాణులు హ్యాంగ్ అవుతున్నాయి.
రోహిణి కార్తె ప్రభావం
మరో మూడు రోజుల్లో రోహిణి కార్తె ప్రవేశిస్తుండటంతో ఎండ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. రానున్న మూడునాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగడమే కాకుండా వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్యాహ్నం వేళల్లో బయటకు రావొద్దని, ఇంటివద్దే ఉండటం శ్రేయస్కరమని సూచించింది. అన్ని వయసులవారు జాగ్రత్తలు తీసుకోవాలని, నీరు ఎక్కువగా తాగాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.