శ్రీనగర్ ప్రభుత్వ ఎన్ఐటీ కళాశాలలో కెమికల్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్న ఈ అమ్మాయి పేరు కృష్ణవేణి. స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలోని మారుమూల గిరిజన గ్రామమైన పాలాయితాండ. తండ్రి ఆడె విష్ణు సన్నకారు రైతు. కృష్ణవేణికి చదువంటే మక్కువ. మూడోతరగతివరకు సొంతూళ్లే చదివిన ఆమె.. నాలుగోతరగతి నుంచి పది వరకు, ఆ తర్వాత ఇంటర్మీడియట్ అంతా ప్రభుత్వ గిరిజన వసతి గృహాల్లోనే సాగింది. 2016-17లో ఇంటర్ పూర్తి చేసింది. 2018 ఏప్రిల్‌లో జేఈఈ రాయగా.. జమ్మూకశ్మీర్ రాజధాని శ్రీనగర్ నిట్‌లో కెమికల్ ఇంజనీరింగ్‌లో ఉచితంగా సీటు లభించింది. 2018 జులై 21న కళాశాలలో రిపోర్టు చేయాలని సమాచారం వచ్చింది. ఈ విషయం సైతం అప్పట్లో అమెకు జులై 19న తెలిసింది. రెండురోజుల్లోగా తల్లిదండ్రులను ఒప్పించడం... ఖర్చులతో కూడిన శ్రీనగర్ ప్రయాణంతో పాటు కళాశాల ఫీజు కింద 81 వేల రూపాయలు చెల్లించడమంటే ఆమెకు పరీక్షగా మారింది.
దాతల సాయం: అప్పట్లో ఇదే విషయమై ఈటీవీ-ఈనాడులో కృష్ణవేణి దయనీయస్థితిపై మానవీయ కథనం ప్రసారం కావడంతో మానవతావాదులు స్పందించారు. అప్పటి జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి సొంతంగా 51వేల రూపాయలు ఇవ్వగా మరికొందరు దాతలు లక్ష రూపాయల వరకు సాయం చేయడంతో.. తండ్రితో కలిసి మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి విమానంలో బయలు దేరి.. సకాలంలో కళాశాలలో రిపోర్టు చేయడంతో.. సీటు ఖాయమైంది.
ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం: అప్పట్లోనే కృష్టవేణి చదువు కోసం ఆర్థిక సాయం చేయాలని.. ఆమె తండ్రి ఆడె విష్ణు ఉట్నూర్ ఐటీడీఏ అధికారులకు అర్జీ పెట్టుకున్నాడు. ఇతర రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చే వెసులుబాటుతో పాటు... గిరిజన విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలు మంజూరు చేయాలని దరఖాస్తులు చేసుకున్నాడు. నాలుగేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నప్పటికీ.. ఇంత వరకు నయాపైసా మంజూరు చేయలేదు. విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రభుత్వ పెద్దలుప్రకటిస్తుంటే... కశ్మీర్‌లో చదువుతున్న కృష్ణవేణి పట్ల ఐటీడీఏ అధికారులు స్పందిస్తున్నతీరు విమర్శలకు తావిస్తోంది.
ఇదీ చూడండి: