ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో 625 బస్సులుండగా మొదటిరోజు 292 బస్సులు తిరిగాయి. తొలిరోజు 71,037 కిలో మీటర్లు తిరగగా, సుమారు 13 వేల లీటర్ల డీజిల్ వినియోగమైంది. రూ.7.74 లక్షలు డీజిల్‌కు ఖర్చయింది. ఆదాయం మాత్రం రూ.5.80 లక్షలు వచ్చింది. 20వ తేదీన 279 బస్సులు సేవలందించగా 69,235 కి.మీటర్లకు 12 వేలకు పైగా లీటర్ల డీజిల్ ఉపయోగించారు. ఇందుకు రూ.7.55లక్షలు ఖర్చయింది. వచ్చిన ఆదాయం రూ.6.90 లక్షలు మాత్రమే.
తొలిరోజు ఆయా ప్రాంతాల్లో ప్రయాణికులు లేక ఆదాయం తక్కువగా వచ్చిన ప్రాంతాల్లో కొన్ని బస్సులను రద్దు చేశారు. రెండోరోజు 279 బస్సులు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాయి. ఆదిలాబాద్ డిపో పరిధిలో 56, నిర్మల్-51, మంచిర్యాల-72, భైంసా-36, ఆసిఫాబాద్-44, ఉట్నూరు డిపో పరిధిలో 20 బస్సులు నడిచాయి.
ప్రతిరోజూ రీజియన్‌లోని ఆరుడిపోల పరిధిలో 3 లక్షల కి.మీ తిరగాల్సి ఉండగా లక్షకు తక్కువగానే తిరుగుతున్నాయి. ప్రయాణికులు తక్కువగా ఉండటంతో ఆదాయం రాకపోగా నష్టం వాటిల్లుతోంది. ఆయా డిపోల పరిధిలో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బస్సులు నడిచాయి. ప్రాంగణాల్లోని ఫ్లాట్‌ఫామ్‌ల వద్ద బస్సులు నిండుగా ఉన్నప్పటికీ ప్రయాణికుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. రాత్రిపూట సేవలు నిలిపివేయడం వేసవిలో ఆర్టీసీకి ప్రతికూలాంశంగా మారింది. దీంతో ఆర్టీసీ రోజుకు సుమారు రూ.75 లక్షల ఆదాయం నష్టపోతోంది.
నష్టాలు భరిస్తూ సేవలందిస్తున్నాం
ప్రభుత్వ సూచనల మేరకు ప్రజల సౌకర్యార్థం ఆర్టీసీ సేవలను ప్రారంభించాం. కానీ రెండు రోజులుగా ప్రయాణికులు లేకపోవడంతో సరిపడా ఆదాయం రాక నష్టపోతున్నాం. నష్టాన్ని భరిస్తూ ప్రయాణికులకు సేవలందిస్తాం. బస్సుల్లో ప్రయాణికులు నిబంధనలు పాటించాలి. చేతులు శుభ్రం చేసుకునేందుకు బస్సుల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచుతున్నాం.
- కె.విజయ్‌భాస్కర్, ఆర్‌ఎం. ఆదిలాబాద్