ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని రుయ్యాడి గ్రామానికి చెందిన 11 మంది ఎస్సీ కుటుంబాలకు ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం హయాంలో భూములు ఇచ్చారు. 2002లో అదే మండలంలోని కజర్ల గ్రామశివారులోని సర్వే నంబర్ 243లో 19 ఎకరాల భూమిని కేటాయించారు. ఒక్కో కుటుంబానికి గానూ 1.30 ఎకరాలు పంపిణీ చేశారు. అప్పటి నుంచి గత రెండేళ్ల వరకు ఆ పంటభూముల్నే నమ్ముకొని ఆయా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. పట్టా పాసుపుస్తకాలు రావడం వల్ల రుణాలు కూడా పొంది పంటలను సాగుచేస్తున్నారు.
ఆశపడ్డం.. ఆగమైనమ్..
తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒక్కో ఎస్సీ కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాటతో మురిసిపోయారు. తమకూ ఆ భూములు వస్తాయని ఆశ పడ్డారు. కానీ రెండేళ్ల క్రితం ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూ దస్త్రాల ప్రక్షాళన కార్యక్రమం వల్ల అసలుకే ఎసరొచ్చింది. వారు సాగు చేస్తున్న భూములకు పట్టాలు ఇవ్వకపోగా... ఉన్న భూమిలో ఒకరిద్దని అటవీశాఖ భూములని లాక్కున్నారు. రైతులు భూమిలోకి అడుగు పెట్టేందుకు వీలులేకుండా కందకాలు తవ్వించారు.
పొట్టకూటి కోసం కూలీలమయ్యాం...
వస్తుందనుకున్న మూడెకరాల భూమి రాక, సాగు చేస్తున్న భూమికి పట్టాపాసు పుస్తకాలు రాక, బ్యాంకు రుణాలు పొందలేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడు పంటలు కూడా సాగుచేసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పోషణ భారమై వ్యవసాయాన్ని వదిలి కూలీలుగా మారామాని వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఈటీవీ భారత్ కథనానికి స్పందన... బాధితులకు కలెక్టర్ ఆసరా