పంట క్రయవిక్రయాలతో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏటా కోట్లలో లాభాలు ఆర్జించేది. మిగులు బడ్జెట్‌తో ఉన్న ఈ యార్డు నుంచి రాష్ట్రంలోని వివిధ మార్కెట్లకు రుణాలు ఇచ్చింది. సిద్దిపేట, వనపర్తి మార్కెట్లకు రూ.3 కోట్లు, గజ్వేల్, మహబూబ్‌నగర్ జిల్లా బాదెపల్లి యార్డులకు చెరొక కోటి రూపాయలు అందించింది. రంగారెడ్డి జిల్లాలోని వట్‌పల్లి యార్డుకు కోటి 59లక్షల చొప్పున మొత్తం రూ.9కోట్ల 59లక్షలు అప్పు ఇచ్చింది. అప్పులు తీసుకునేలా ప్రభుత్వం ప్రత్యేక జీవోలను జారీ చేసింది. ఇందులో ఇప్పటి వరకు వనపర్తి మార్కెట్‌యార్డునుంచి కేవలం 65లక్షల 90వేల మాత్రమే వసూలైంది. అప్పుతీసుకున్న ఏ యార్డు కూడా తిరిగి చెల్లించడంలేదు. మాట కదిలిస్తే ఎప్పటికప్పుడు గుర్తుచేస్తున్నామనే మాట మాత్రమే వినిపిస్తోంది.
కనీస వసతులు సమకూర్చుకోలేక
ఇచ్చిన అప్పులు తిరిగి వసూలు కాకపోవడం వల్ల మార్కెట్‌యార్డులో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోంది. పంటలు నిల్వ చేసుకోవడానికి సరిపడే గోదాములు నిర్మించుకోలేని దుస్థితి తలెత్తింది. యార్డుకు వచ్చిన రైతులకు కనీస సౌకర్యాలు సమకూర్చలేక విమర్శల పాలైంది. లాభాలు ఆర్జించి ఇతరులకు ఇవ్వడమే తప్ప... పంట ఉత్పత్తుల పర్యవేక్షణ కోసమైన కూలీలకు ఇవ్వడంలేదనే ఆవేదన వినిపిస్తోంది.
ఎవరినీ ఏమీ అనలేక...
అప్పులు ఇచ్చి .. దాదాపుగా నాలుగేళ్ల కాలం దాటిపోతున్న తిరిగిరాబట్టుకోలేక ఉన్నదాంట్లో పనులను చక్కబెట్టుకోవాల్సి వస్తోంది. మార్కెట్ పాలకవర్గాల సమావేశాల్లోనూ చర్చకు వస్తున్నప్పటికీ ఎవరినీ ఏమీ అనలేని దయనీయస్థితి నెలకొంది.
ఇదీ చూడండి: నాబార్డు ఛైర్మన్‌కు అంతర్జాతీయ పదవి.. తొలిసారి తెలుగువ్యక్తికి దక్కిన గౌరవం