బయటనుంచి చూస్తే... ఇదేదో సాధారణ రాళ్లకట్టనో.. లేక ప్రహరీనో అనుకుంటే... పొరపాటే. ఇది లయకారుడైన శివుడి సన్నిధి. పాతాళ నాగభైరవుడు కొలువైన ప్రసిద్ధిపొందిన గుహ. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం శాంతాపూర్‌కు దాదాపుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీప్రాంతంలో ఉన్న ఈ గుహకు.. పాతాళ నాగభైరవ ఆలయంగా పేరుంది. ప్రాకృతిక రాళ్ల సంపదకు ఆలవాలమైన ఈ ప్రాంతంలో... ఇలా గుహలో గుడి ఉన్న విషయం స్థానికులకు తప్పా.. ఇప్పటికీ బాహ్యప్రపంచానికి తెలియదు.
శివరాత్రి, శ్రీరామనవమి, దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పక్కనే రామాలయం, దత్తాత్రేయ మందిరం, అమ్మవారి మందిరం సైతం ఉన్నాయి. వీటికి భిన్నంగా గుహలో ఉన్న నాగభైరవగుహనే ప్రత్యేకమైంది. ఆలయం లోపలి భాగంలో ముగ్గురు నిలబడి పూజలు చేయడానికి అనువుగా ఉంటుంది. లోపలికి వెళ్లాలంటే వంగివెళ్లాల్సిందే. ఆధునిక కట్టడానికి సంబంధించిన ఆనవాళ్లు ఎక్కడ కనిపించవు. లోపల శివుడి విగ్రహం ఉండటంతో... పాతాళ నాగభైరవ గుహగా పేరొచ్చినట్లు తెలుస్తోంది. స్థానికంగా ఉండే రాములు అనే నిరుపేద ఆదివాసీ... ప్రతిరోజు దీపారాధన చేస్తాడు. చారిత్రక వారసత్వ సంపద అయినప్పటికీ... రక్షించుకోవడంలో అధికారయంత్రాంగం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పురావస్తుశాఖ పరిశోధనలు చేస్తే... ఆలయం గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని... స్థానికులు, రచయితలు చెబుతున్నారు.
నేను ఇక్కడ 10 సంవత్సరాలుగా పూజ చేస్తున్నా.. కానీ ఎవరూ ఏమీ ఇవ్వరు. ఫించన్ కూడా రావట్లేదు. నా కొడుకులు వాళ్లు వేరే ఉంటారు. నేను రోజూ ఇక్కడ దీపారాధన చేస్తాను. 10-15 చోట్ల పూజలు చేయాలి. ఊర్లో వాళ్ల దగ్గర డబ్బులు తీసుకుని దీపాన్ని కాపాడుతున్నా... - రాములు, పూజారి
12నెలలు ఎప్పుడూ సల్లగా ఉంటుంది. శివరాత్రి, శ్రీరామనవమి, దత్తాత్రేయ జయంతి నాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి. పట్టించుకునే వాళ్లు లేరు.. ప్రభుత్వం వెంటనే స్పందించి.. దీనిని అభివృద్ధి చేయాలి. -గంగాధర్, భక్తుడు
బయట నుంచి చూస్తే వరుసగా పేర్చిన రాళ్లకట్టగా బంకర్‌ను పోలిన విధంగా కన్పిస్తుంది. పది మెట్లు దిగి లోపలికి వెళ్తే త్రిశూలంతో నిలబడిన శివుడి విగ్రహం దర్శనమిస్తోంది. స్థానికంగా పాతాళ నాగభైరవ ఆలయంగా ప్రసిద్ధి పొందింది. ప్రాకృతిక రాళ్ల నిక్షేపాలకు నిలయమైన శాంతాపూర్ అటవీప్రాంతంలో ఈ గుహ ఉన్న విషయం స్థానికులకు తప్ప ఎవరికీ తెలియదు. - మన్నె ఏలియా, రచయిత
నిర్మాణుష్యమైన శాంతాపూర్ అటవీ ప్రాంతం ఒకప్పుడు దండకారణ్యంలోకి వచ్చేది. క్రమంగా అంతరించిపోతున్న అటవీ సంపదతో బాహ్యప్రపంచపు జాడ కనిపిస్తోంది.
ఇదీ చూడండి: స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంగా.. టీహబ్-2కి సర్వం సిద్ధం