negligence of duties : సరిగ్గా ఏడాది కిందట అంటే జూన్- జులై నెలలో ఆయన ఓ శాఖకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అధికారిగా నియమితులు కావడమే అత్యంత ఖరీదైన అధికారవర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉమ్మడి జిల్లాలో ఓ కీలకమైన ప్రజాప్రతినిధి సహా మరో నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధిని ప్రసన్నం చేసుకొని పోస్టును దక్కించుకోవడం ఆశాఖ అధికారవర్గీయులతోపాటు ప్రజాప్రతినిధుల్లో చర్చనీయాంశమైంది. రూ.కోట్లాది వ్యయం చేసే పనుల కేటాయింపుల్లో ఆయనదే పైచేయి. జిల్లాలవారీగా ప్రజా అవసరాలరీత్యా సమన్యాయాన్ని పాటించకపోవడం, పనులను పర్యవేక్షించకపోవడంతో పాటు తన బదిలీకి సహకరించిన ఇద్దరు నేతల కనుసన్నల్లోనే ఆ అధికారి పావులు కదుపుతున్నారనే అభిప్రాయం వ్యక్తం కావడం మిగిలిన ప్రజాప్రతినిధులకు మింగుడుపడటంలేదు. ఉమ్మడి జిల్లాలోని ముగ్గురు సబ్ డివిజన్ అధికారులకు ఇచ్చిన ప్రాధాన్యత మిగిలినవారికి ఇవ్వరనే ఆరోపణ సైతం ఆశాఖలో బలంగా నాటుకుంది.
దారిలో పెట్టాల్సింది పోయి.. దారి తప్పారు
కీలక అధికారిక హోదాకావడంతో ఎవరూ పెద్దగా నోరుమెదపడానికి ఇష్టపడకపోవడం ఆయనకు కలిసి వస్తోంది. వాస్తవంగా ఆయన విధులు నిర్వహించే అధికారిక ప్రధాన కేంద్రం (హెడ్ క్వాటర్) ఆదిలాబాద్. బాధ్యతల నిర్వహణలో భాగంగా మిగిలిన నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలో జరిగే రూ.వందల కోట్ల పనుల తీరును పర్యవేక్షణ చేయాలి. డివిజన్, సబ్ డివిజన్ స్థాయి సిబ్బంది పొరపాటు చేస్తే ‘దారి’లో పెట్టాల్సిందిపోయి తానే దారితప్పడం విమర్శలకు తావిస్తోంది.
మీటింగ్ల్లోనూ కనిపించరు
higher officer doesn't attend duties : శాఖాపరంగా హైదరాబాద్‌లో జరిగే సమావేశాలకు, ఉమ్మడి జిల్లాల్లో జరిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరుకావాల్సి ఉంది. హైదరాబాద్‌లో ఉండటానికి ఇష్టపడే ఆయన అక్కడ ఉన్నతాధికారుల సమావేశాలకు తప్పితే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాలకు హాజరైన సందర్భాలే లేవు. ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి తరుచూ గైర్హాజరవుతూ తనకు బదులు కిందిస్థాయి అధికారులను పంపిస్తున్నారనే ఆరోపణపై సమావేశంలోనే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఫలితంలేకుండా పోయింది.
అయ్యో పాపం.. కనీసం సంతకాలకు కూడా తీరికలేదాయే..
government officer not sign in register: ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి కార్యాలయంలో రిజిస్టర్‌లో సంతకం చేయాల్సి ఉంటుంది. ఆశాఖకు చెందిన రిజిస్టర్‌లో ఆ అధికారి పేరు కూడా ఉంది. కానీ సంతకాలు చేయడంలేదు. పోనీ కీలక అధికారి కదా సంతకాలు చేయడం ఉండదేమో అనుకోవడానికి వీల్లేదు. కొన్ని కొన్ని చోట్ల ఆయన ఆన్ డ్యూటీ(ఓడీ), మరికొన్ని చోట్ల (హైదరాబాద్ సమావేశానికి) వెళ్లినట్లుగా, అప్పుడప్పుడు విధుల్లో ఉన్నట్లు సంతకాలు చేసినట్లు నిరూపించే రిజిస్టర్ లభించింది. అంటే విధులకు గైర్హాజరైనప్పటికీ ఎప్పుడో ఓసారి వచ్చి తీరిగ్గా సంతకాలు చేసుకోవచ్చనే నిర్లక్ష్యం ఆయనలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇదీ పరిస్థితి
ఉదాహరణకు ఆగస్టు ఒకటో తేదీన ఆదివారం వచ్చింది. ఆ మరుసటి రోజు బోనాల పండుగ పేరిట సెలవు ఉన్నట్లు రిజిస్టర్‌లో ఉంది. ఆగస్టు మూడో తేదీన ఆన్ డ్యూటీ(ఓడీ) వేసి, నాలుగో తేదీన కార్యాలయానికి వచ్చినట్లు సంతకం చేసి అయిదో తేదీన మళ్లీ ఓడీ వేసి ఉంది. ఇలా ప్రతి నెలలో ఏదో ఒకలా ఉండటంతో సంతకాలు చేయడానికి సైతం తీరికలేదా? లేక విధులకు హాజరుకావడంలేదా? అనే అనుమానాలకు తావిస్తోంది. కొన్ని సందర్భాల్లో ఆయనను కలవడానికి కొంతమంది ప్రజాప్రతినిధులు వెళ్లి వాకబు చేస్తే ‘సార్ లేరు. డ్యూటీలో వేరే ప్రాంతానికి వెళ్లారు.’ అనే సమాధానం కార్యాలయ సిబ్బంది నుంచి వినిపిస్తోంది. ఆ అధికారి పనితీరు మిగిలిన ప్రభుత్వశాఖల అధికారులపై సైతం ప్రభావం చూపించే పరిస్థితి ఏర్పడుతోంది. ఆశాఖకు సమాంతరంగా ఉండే మరో శాఖ అధికారుల పరిస్థితి ఇప్పుడే అదే కోవలోకి వస్తోంది.
ఇదీ చూడండి: Pensioners day 2021: ఆదర్శంగా విశ్రాంత ఉద్యోగుల జీవనం.. సేవా కార్యక్రమాలతో బిజీబిజీ