42 Years for Indravelli Incident: సహజసిద్ధమైన అటవీ సంపదకు పెట్టింది పేరైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జల్, జంగల్, జమీన్ పేరిట.. కుమురం భీం చేసిన పోరాటం తెలుగు గడ్డపై చెదరని సంతకమే. నిజాం పాలనపై తిరుగుబాటు బావుట ఎగరేసిన ఉద్యమమే. దండకారణ్యంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలో 1975 నుంచి 80 వరకు అప్పటి పటేల్, పట్వారీ వ్యవస్థ మరింత మితిమీరింది. విసిగిపోయిన గిరిజనం భూమి, భుక్తి, విముక్తి నినాదంతో.. 1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో సభకు నగారా మోగించింది.
తొలుత సభ నిర్వహణకు అనుమతిచ్చిన అప్పటి పోలీసు యంత్రాంగం.. చివరి నిమిషంలో రద్దు చేసింది. విషయం తెలియని ఆదివాసీ జనం అప్పటికే ఉట్నూర్, నార్నూర్, ఇంద్రవెల్లి, ఆసిఫాబాద్, జైనూరు, కెరమెరి, తలమడుగు, తాంసీ ప్రాంతాల్లోని ప్రతి గూడెంలో తుడుం మోగించి.. ఇంద్రవెల్లి బాట పట్టింది. కాలినడకన, ఎద్దుల బండ్లపై.. ఇలా ఎవరికి తోచినరీతిలో వారు దండులా తరలిరావడంతో ఇంద్రవెల్లి గిరిజన సంద్రంగా మారింది. ఆరోజు ఇంద్రవెల్లి సంత కూడా ఉండటంతో జనం తాకిడి మరింత పెరిగింది.
Indravelli Incident: ఈ సమయంలోనే కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో చినికి చినికి గాలివానగా మారినట్లు ఘర్షణ తీవ్రమైంది. జనంలో నుంచి ఓ మహిళ పదునైన ఆయుధంతో ఓ పోలీసుపై దాడి చేయడంతో ఆందోళన చెందిన అధికారులు.. కాల్పులకు ఆదేశాలిచ్చారు. దీంతో ఆ ప్రాంతం గిరిజనుల హాహాకారాలతో అట్టుడిగిపోయింది. ఏకబిగిన పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇంద్రవెల్లి ఆదివాసుల రక్తంతో తడిసి ముద్దవడంతో మరో జలియన్‌వాలాబాగ్‌గా ప్రాచుర్యం పొందింది.
ఆ రోజు పోలీసు కాల్పుల్లో ఆదివాసీలు మరణించిన ప్రదేశంలో ప్రజా సంఘాలు.. భారీ స్థూపం నిర్మించాయి. అయితే.. ఆదివాసీల ఇంద్రవెల్లి పోరాటం వెనక.. అప్పటి పీపుల్స్‌వార్ ప్రమేయం ఉందనేది వాదన ఉంది. ఆ కారణంగా ఆ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించికునేందుకు ప్రభుత్వాలు అనుమతించలేదన్న అభిప్రాయం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గిరిజన సంఘాల ఒత్తిడి, విజ్ఞప్తుల మేరకు ఆంక్షలు ఎత్తేసింది.
స్థూపం వద్దకు వెళ్లి, అమరులను స్మరించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు తమ ముందుతరం చేసిన త్యాగాలు వృథా కావని, వారి ఉద్యమ స్ఫూర్తితో అటవీ భూములపై హక్కుల కోసం ముందుకు సాగుతామని స్పష్టం చేస్తున్నారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున వచ్చిన గిరిజనులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అటవీ సంపదపై హక్కులకు రక్షణ కల్పించాలన్న వాదనను గిరిజన సంఘాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాయి. ఇంద్రవెల్లిని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇవీ చూడండి..
Ambedkar Memorial : నెల రోజుల్లో.. అంబేడ్కర్ స్మృతివనం సందర్శనకు అనుమతి
'నా స్నేహితుడిని చంపేశా.. కలలోకి వచ్చి హింసిస్తున్నాడు'.. మృతదేహం కోసం ఏడాదిగా..