ఐదేళ్ల కిందట.. రియోలో.. ఒకటి.. రెండు.. మూడు.. అనుకుంటూ రోజులు లెక్క పెట్టుకుంటూ నైరాశ్యంతో భారంగా అడుగులు వేస్తున్న వేళ.. పన్నెండు రోజులు గడిచాక కానీ పతక కరవు తీరలేదు. అప్పుడు దేశం ఆశల్ని నిలబెట్టింది ఇద్దరమ్మాయిలు. రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం గెలిచి హమ్మయ్య అనిపిస్తే.. షట్లర్ సింధు రజతం సాధించి ఆనందాన్ని రెట్టింపు చేసింది. అప్పుడే కాదు.. ఇప్పుడు టోక్యోలోనూ..
భారతావని ఆశలను నిలబెడుతున్నది.. పతకాశలు రేపుతున్నది.. పతకాలు పట్టుకొస్తున్నది కూడా అమ్మాయిలే. తొలి రోజే వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 135 కోట్లమంది భారతీయుల ఆశల్ని మోస్తూ రజతం సాధిస్తే.. ఇప్పుడు బాక్సర్ లవ్లీనా 'పతక' పంచ్ విసిరింది. సింధు మరోసారి తన రాకెట్ వేగాన్ని చూపిస్తూ పతకం దిశగా అడుగులేస్తోంది.
నిన్నటిదాకా మరో పతకం కోసం ఆశగా చూసిన అభిమానుల్లో.. లవ్లీనా, సింధుల ప్రదర్శనతో పసిడి ఆశలు రేకెత్తుతున్నాయి. పదమూడేళ్ల ముందు వ్యక్తిగత స్వర్ణంతో నవశకానికి తెరతీసిన బింద్రా ఘనతను వీళ్లిద్దరూ పునరావృతం చేస్తారని.. టోక్యోలో పసిడి కాంతులు విరబూయిస్తారని భారత క్రీడాభిమానులంతా ఆశగా చూస్తున్నారు.
ఇంకో రెండు.. బాక్సింగ్‌లో లవ్లీనా, బ్యాడ్మింటన్‌లో సింధు గెలవాల్సిన పోరాటాలు. పట్టుదలను కొనసాగిస్తూ ఈ ఇద్దరూ ఆ రెండు పోరాటాల్లో జయకేతనం ఎగురవేస్తే త్రివర్ణ పతకానికి మరోసారి పసిడి పట్టాభిషేకం జరుగుతుంది. భారత వీర వనితలు ఆ కలల్ని సాకారం చేసే క్షణాల కోసమే ఇప్పుడందరి ఎదురు చూపులు!
ఇవీ చదవండి: