పారాలింపిక్స్‌కు భారత బృందం కదిలింది. ఈనెల 24న టోక్యో వేదికగా ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పాల్గొనే 54 మంది సభ్యుల భారత జట్టు గురువారం బయల్దేరి వెళ్లింది. క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ బృందాన్ని దగ్గరుండి పంపించి శుభాభినందనలు తెలిపారు. గతంలో కంటే ఈసారి క్రీడల్లో భారత బృందం ఎక్కువ పతకాలు సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టోక్యో పారాలింపిక్స్‌కు దేవేంద్ర జజారియా (జావెలిన్ త్రో), మరియప్పన్ తంగవేలు (హైజంప్), సందీప్ చౌదరి (జావెలిన్ త్రో) లాంటి వారి నుంచి భారత్ పతకాలు ఆశిస్తోంది. వీరిలో జజారియా 2004, 2016లో స్వర్ణ పతకాలు గెలవగా, 2016 రియో ఒలింపిక్స్‌లో తంగవేలు పసిడి నెగ్గాడు. సందీప్ చౌదరి 2019 ప్రపంచ పారాలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గాడు. రియో క్రీడల్లో భారత్ రెండు స్వర్ణాలు, ఒక్కో రజతం, కాంస్యం గెలిచింది. పారాలింపిక్స్‌లో మన దేశానికిదే అత్యుత్తమ ప్రదర్శన. టోక్యోలో ఈ రికార్డును మెరుగుపరచాలని భారత్ కోరుకుంటోంది. ఆగస్టు 27న పురుషులు, మహిళల ఆర్చరీ ఈవెంట్లతో భారత్ పోటీ ప్రారంభం కానుంది.
ఇదీ చూడండి:- పతకం గెల్చిన బాక్సర్‌కు రూ.కోటి - రోడ్‌కు ఆమె పేరు