కరోనా భయాల మధ్య సాగుతున్న ఒలింపిక్స్‌కు మరో ముప్పు పొంచి ఉంది. జపాన్‌లో నెపార్తక్ తుపాను ఈ నెల 27న తీరం దాటే అవకాశమున్నట్టు ఆ దేశ వాతావరణశాఖ వెల్లడించింది. ఫలితంగా టోక్యో ఒలింపిక్స్‌లో అరంగేట్ర క్రీడ సర్ఫింగ్ షెడ్యూల్లో నిర్వాహకులు మార్పులు చేయక తప్పలేదు.
నెపార్తక్.. తూర్పు జపాను వద్ద పెసిఫిక్ సముద్రంవైపు మంగళవారం తీరం దాటే అవకాశముంది. దీంతో తీవ్రస్థాయిలో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉంది. బుధవారం నాటికి పరిస్థితి మరింత ఉద్ధృతంగా మారే సూచనలు ఉన్నాయి. అందువల్ల బుధవారం జరగాల్సిన సర్ఫింగ్ హీట్స్.. మంగళవారానికి మార్చారు నిర్వాహకులు.
వాతవరణ మార్పుల ప్రభావం ఈసారి ముందుగా ఆర్చరీపై పడింది. మంగళవారం మధ్వాహ్నం జరగాల్సిన మ్యాచ్‌లను బుధవారం, గురువారానికి వాయిదా వేశారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ వాతవరణ సమస్యల కారణంగా అనేకమార్లు ఆటలను ఒక గంట ఆలస్యంగా నిర్వహించారు.
ఇదీ చదవండి: స్వదేశానికి మీరాబాయి.. ఏఎస్పీగా ఉద్యోగం