టోక్యో ఒలింపిక్స్‌లో సోమవారం జరిగిన హాకీ క్వార్టర్స్‌లో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. ప్రపంచ నంబరు.2 జట్టు అయిన ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 1-0 తేడాతో గెలుపొంది.. సెమీఫైనల్‌కు చేరింది. 22వ నిమిషం వద్ద భారత క్రీడాకారిణి గుర్జిత్ కౌర్ గోల్ చేసింది. ఆ తర్వాత మ్యాచ్‌లో ఆద్యంతం దూకుడు ప్రదర్శించిన రాణి రాంపాల్సేన.. ప్రత్యర్థిని ఖాతా తెరవనీయకుండా అడ్డుకోగలిగింది.
గ్రూప్ దశలో వరుసగా 3 మ్యాచ్‌లు ఓడినా కుంగిపోని భారత మహిళా హాకీ జట్టు.. చివరి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఒలింపిక్స్‌లో భారత మహిళా హకీ జట్టు సెమీఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి. 1980 మాస్కోలో జరిగిన విశ్వక్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసి నాలుగో స్థానంలో నిలిచింది. ఇన్నేళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో మళ్లీ ఆ స్థాయిలో ప్రదర్శన చేయడం విశేషం.
గోల్‌కీపర్ సత్తా..
భారత మహిళల జట్టుకు చెందిన గోల్ కీపర్ సవితా పునియా.. ఆస్ట్రేలియా చేసిన ప్రయత్నాలను 9 సార్లు నిలువరించింది. ఈ విజయంలో ఎక్కువ శాతం ఘనత ఆమెకే చెందుతుంది. బుధవారం జరగనున్న సెమీఫైనల్లో అర్జెంటీనాతో భారత మహిళా హకీ జట్టు తలపడనుంది.