ఒలింపిక్స్‌లో భారత హాకీ అమ్మాయిలు పతకాన్ని మించే సాధించారని కోచ్ స్జోర్డ్ మారిజ్నే తెలిపారు. దేశ ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకుంటారని ఆశించారు. కాంస్య పతకానికి చేరువై ఓటమి పాలైంది. దీంతో తమ గుండె పగిలిందని కెప్టెన్ రాణి రాంపాల్ అంటోంది. ఏదేమైనా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాని వెల్లడించింది. ప్లేఆఫ్ పోరులో బ్రిటన్ చేతిలో 3-4 తేడాతో టీమ్‌ఇండియా ఓడిపోయింది.
'నిజమే, ఓడినందుకు బాధగానే ఉంటుంది. మేం గెలవాల్సింది. కానీ నిజంగా ఈ అమ్మాయిలను చూసి నేను గర్వపడుతున్నా. వారు పోరాట పటిమ, నైపుణ్యాలను ప్రదర్శించారు' అని మారిజ్నే తెలిపారు.
'నేను మీ కన్నీళ్లను ఆపలేనని వారితో చెప్పాను. మాటలు వాటిని ఆపలేవు. మనం పతకం గెలవక పోయినా అంతకన్నా పెద్ద విజయమే సాధించామని చెప్పా. ప్రపంచం సరికొత్త భారత జట్టును చూసింది. అందుకు గర్వపడుతున్నా. సాధారణంగా టీమ్‌ఇండియా 2-0తో వెనకబడినప్పుడు 3-0 , 4-0తో ఓడిపోతుంటుంది. కానీ ఈసారి వారు గొప్పగా యుద్ధం చేశారు. నాలుగున్నరేళ్లుగా వారితో కలిసి పనిచేసినందుకు సంతోషంగా ఉంది. వస్తున్న స్పందనకు ఉబ్బితబ్బిబ్బు అవుతున్నా. దేశపౌరులు వారిని తమ గుండెల్లో పెట్టుకుంటారు' అని మారిజ్నే అన్నారు.
కాంస్య పతక పోరులో ఓటమి బాధ కలిగించిందని రాణి రాంపాల్ తెలిపింది. 2-0తో వెనకబడి స్కోరు సమం చేసి 3-2తో పుంజుకున్నామని వెల్లడించింది. విజయాన్ని సమీపించి ఓడిపోవడం వల్ల మాటలు రావడం లేదంది. కొన్నిసార్లు విజయాన్ని సమీపించడమే సరిపోదని పేర్కొంది. కాంస్య పతకం గెలవనందుకు బాధేస్తోందని తెలిపింది.
'ఏదేమైనా మేం అత్యుత్తమంగా పోరాడాం. జట్టును చూసి గర్విస్తున్నా. ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నిలవడం సులభమేమీ కాదు. టోర్నీ సాంతం మేం కలిసికట్టుగా కష్టపడ్డాం. మేం 0-2తో వెనకబడ్డా పుంజుకున్నాం. మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. వారు మమ్మల్ని నమ్మారు. మేం సాధించగలమని విశ్వసించారు' అని రాణి వెల్లడించింది. జట్టులో ప్రతి ఒక్కరు 100% శ్రమించారని, తాము ఎవరినీ నిందించడం లేదని, ఈ రోజు అదృష్టం వరించలేదని డ్రాగ్ ఫ్లికర్ గుర్జీత్ కౌర్ తెలిపింది.
మారిజ్నే రిజైన్..
గ్రేట్ బ్రిటన్‌తో మ్యాచ్ అనంతరం కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్జోర్డ్ మారిజ్నే ప్రకటించారు. ఈ మ్యాచే తనకు చివరిదని తొలుత మీడియా సమావేశంలో వెల్లడించిన ఆయన.. మ్యాచ్ తర్వాత రిజైన్ చేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. పతకం గెలవాల్సిన మ్యాచ్‌ను త్రుటిలో కోల్పోయామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: మహిళా హాకీ జట్టులో స్ఫూర్తినింపిన ప్రధాని మోదీ